అక్రమార్కులపై మోదీ సర్కారు కొత్త అస్త్రం

Update: 2019-11-17 07:00 GMT

బినామీ పేర్లతో అడ్డగోలుగా ఆస్తులు కూడబెట్టే వారి తాట తీసేందుకు మరో చట్టం రాబోతోందా? రోజు రోజుకు పెరిగిపోతున్న అవినీతికి అడ్డుకట్ట వేసేందుకు కేంద్రం రంగం సిద్ధం చేస్తోందా? వీటికి ఇప్పుడు ఔననే సమాధానం వస్తోంది. నోట్ల రద్దు తర్వాత అక్రమార్కులపై మోదీ సర్కారు కొత్త అస్త్రాన్ని సంధించబోతోంది. అదే ఆస్తులకూ ఆధార్‌కూ లింక్‌.

బ్లాక్‌మనీని బయటపెట్టేందుకు తొలి ఐదేళ్లలో పలు కీలక చట్టాలు చేసిన ప్రధాని మోదీ.. తాజాగా ఆస్తులకు, ఆధార్‌కు లింక్‌ చేసే ఆలోచన చేస్తున్నారు. ఇకపై ఆస్తులన్నింటినీ ఆధార్‌తో అనుసంధానించే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇందుకు సంబంధించిన బిల్లు రూపకల్పన తుది దశలో ఉన్నట్లు తెలుస్తోంది. బ్లాక్‌మనీ డబ్బు రూపంలో ఉండకుండా.. పెట్టుబడిగా మారి రియల్‌ ఎస్టేట్‌ రంగంలోకి ప్రవహిస్తోంది. దీంతో స్థలాలు, ఇళ్ల ధరలు ఆకాశాన్నంటి పేదలు, మధ్యతరగతివారు వాటిని కొనలేని పరిస్థితి ఏర్పడుతోంది. ఈ రెండు సమస్యలకూ ఒకేసారి చెక్‌ పెట్టేందుకే మోదీ అధికారంలోకి రాగానే చర్యలు చేపట్టారు. దానివల్ల బ్లాక్‌మనీ రియల్‌ ఎస్టేట్‌ రంగంలోకి చేరి చేతులు మారడం భారీగా తగ్గింది.

ఇపుడు ఆస్తులన్నింటినీ ఆధార్‌తో అనుసంధానించడం వల్ల బినామీ లావాదేవీలు పూర్తిగా తగ్గుతాయని.. పారదర్శకత పెరిగి అందరికీ ఇళ్లు లభించే అవకాశం ఉంటుందని ప్రభుత్వం నమ్ముతోంది. ఆస్తులతో ఆధార్‌ అనుసంధానాన్ని చట్టం వచ్చాక జరిగే క్రయవిక్రయాలకే పరిమితం చేయకుండా.. గతకాలానికి కూడా వర్తింపజేయనున్నట్టు సమాచారం. దీనివల్ల బినామీ లావీదేవీలను దాచిపెట్టడం కుదరదు. కంపెనీల పేరిట కొన్న ఆస్తుల విషయంలోనూ కచ్చితమైన మార్గదర్శకాలు ఉంటాయి. కంపెనీ చరిత్ర, యాజమాన్యం ట్రాక్‌ రికార్డు.. ఇవన్నీ కూడా పరిగణనలోకి వస్తాయంటున్నారు. తెలుగు రాష్ట్రాల్లో సహా ఇప్పటికే కొన్ని రాష్ట్రాల్లో ఇళ్ల రిజిస్ట్రేషన్లు ఆధార్‌ నంబర్‌ ఆధారంగానే జరుగుతున్నాయి.

దేశవ్యాప్తంగా ఏకీకృత చట్టం తేవడం ప్రభుత్వ లక్ష్యమని అధికార వర్గాల్లో ప్రచారం సాగుతోంది. ఈ చట్టం అమల్లోకి వస్తే బినామీలను ఏరిపారేస్తుందని రియల్‌ ఎస్టేట్‌ వర్గాలు అంటున్నాయి. ఉదాహరణకు.. ఆస్తి ఎవరిపేరున ఉంటే వారి ఆధార్‌ నంబరు దానికి జత అయివుంటుంది. ఒకే ఆధార్‌ నంబరుతో పెద్దఎత్తున ఆస్తిని కలిగి ఉండడం అసాధ్యం. ఒకవేళ ఉన్నా ఆదాయ పన్ను యంత్రాంగం దృష్టిలో పడతారు. పైగా లావాదేవీలన్నీ కూడా ఆధార్‌ నంబర్‌ సహితంగానే జరుగుతాయి. ఈ చర్యతో రియల్‌ ఎస్టేట్‌ రంగం నుంచి అక్రమాలను అడ్డకట్ట వేయవచ్చని కేంద్ర ప్రభుత్వం భావిస్తోంది.

Similar News