ఇటలీలో వెనిస్ నగరాన్ని వరదలు ముంచెత్తాయి. నీటిపై తేలియాడే నగరంగా పేరున్న వెనిస్ నగరంలో ఆఫీసులు, పర్యాటక ప్రాంతాల్లో ఆరు అడుగుల వరకు నీరు నిలిచిపోయింది. దీంతో చర్చిలు, చారిత్రాతక కట్టడాలు, ఆఫీసుల్లోకి వరద నీరు వచ్చి చేరింది. దీంతో ఏమర్జెన్సీ సేవలను ముమ్మరం చేశారు.
వారం క్రితం వరకు సిటీ ఆఫ్ వాటర్ గా ముద్దుగా పిలుచుకున్న నగరం ఇది. కానీ, ఇప్పుడు ఎటూ చూసిన నీరే కనిపిస్తోంది. నగరం కీలక ప్రాంతమైన సెయింట్ మార్క్స్ స్క్వేర్ నుంచి ఎక్కడ చూసినా వరద నీరే.
ఇటలీ ఈశాన్య తీరంలో ఉండే వెనిస్‌కు ఎంతో ప్రత్యేకత ఉంది. దేశంలో పర్యాటకుల్ని విశేషంగా ఆకట్టుకునే ప్రాంతం. నీళ్లపై తేలియాడుతున్నట్లుండే ఈ నగరం వందకు పైగా దీవుల సముదాయం. యునెస్కో నుంచి ప్రపంచ వారసత్వ సంపదగా గుర్తింపు కూడా పొందింది. కానీ, వరద నీటితో కళల నగరం కళ తప్పింది. నగరంలో నాలుగు నుంచి ఆరు అడుగుల మేర నీరు నిలిచిపోవటంతో నీటీపై తెలియాడే నగరం కాస్త నీటిలో మునిగిన నగరంగా మారిపోయింది. సిటీలోని చారిత్రాక కట్టడాలు దెబ్బతిన్నాయి. దీంతో పర్యాటకం పూర్తిగా నిలిచిపోయింది. కొన్ని రోజులకు ముందు టూరిస్టులతో సందడిగా కనిపించిన అందమైన నగరం ఇప్పుడు ఎటూ చూసినా నీరే కనిపిస్తోంది.
సముద్ర కెరటాలు అత్యధిక ఎత్తులో వచ్చినప్పుడు 80 శాతానికి పైగా నగరం వరద బారిన పడింది. వెనిస్‌లోని అత్యంత లోతట్టు ప్రాంతాల్లో ఒకటైన సెయింట్ మార్క్స్ స్క్వేర్ పూర్తిగా నీట మునిగింది. చారిత్రక సెయింట్ మార్క్స్ బాసిలికా చర్చ్‌లోకి నీరు పోటెత్తింది. ఆఫీసులు, ఇళ్లు, హోటల్స్ ఇలా సిటీలో అన్ని ప్రాంతాల్లో వరద నీరు ఉండటంతో జనజీవనం స్థంభించిపోయంది. నగరంలో ఇళ్లకు విద్యుత్తు సరఫరా ఆపేశారు.