ఢిల్లీ జవహర్‌లాల్ నెహ్రూ యూనివర్సిటీ విద్యార్థులు మళ్లీ రోడ్డెక్కారు. సమస్యల పరిష్కారం కోరుతూ పార్లమెంట్ వరకు మార్చ్ చేపట్టారు. వందల మంది విద్యార్థులు దేశ రాజధానిలో నిరసన ర్యాలీ చేపట్టారు. ప్రభుత్వం, వర్సిటీ యాజమాన్యానికి వ్యతిరేకంగా నినాదాలతో హోరెత్తించారు. ప్రభుత్వ విద్యను కాపాడాలనే విషయాన్ని ఎంపీలకు తెలియజేయడానికే పార్లమెంట్ వరకు ర్యాలీ చేపట్టినట్లు విద్యార్థులు తెలిపారు. ఐతే, విద్యార్థుల ర్యాలీని పోలీసులు మధ్యలోనే అడ్డుకున్నారు. దాంతో స్టూడెంట్స్ రోడ్డుపైనే బైఠాయించారు.
ఫీజుల పెంపునకు నిరసనగా విద్యార్థులు ఆందోళనకు దిగారు. హాస్టల్ గది అద్దె, మెస్ ఛార్జీల పెంపు, డ్రెస్‌కోడ్‌పై హాస్టల్ మాన్యువల్‌లో మార్పులకు వ్యతిరేకంగా నిరసన బాట పట్టారు. ఫీజుల పెంపను వెనక్కి తీసుకో వడంతో పాటు హాస్టల్ మాన్యువల్‌లో ప్రతి పాదించిన మార్పులను ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు. గత వారం అన్ని విద్యార్థి సంఘాలు వర్సిటీ ప్రాంగణంలో ఆందోళన చేశాయి. తాజాగా పార్లమెంట్ శీతాకాల సమావేశాలు ప్రారంభమైన నేపథ్యంలో పార్లమెంట్ వరకు ర్యాలీ చేపట్టారు.
స్టూడెంట్స్ ఆందోళనలతో పలు ప్రాంతాల్లో ఉద్రిక్తత చోటు చేసుకుంది. అవాంఛనీయ ఘటనలు జరగకుండా జేఎన్‌యూ, పార్లమెంట్ పరిసరాల్లో భారీగా బలగాలను మోహరించారు. యూనివర్సిటీలో 144 సెక్షన్ విధించారు. 14 వందల మంది అదనపు బలగాలను వర్సిటీకి తరలించారు.
ఫీజుల పెంపు-విద్యార్థుల ఆందోళనలపై ప్రభుత్వం త్రిసభ్య కమిటీని నియమించింది. యూజీసీ మాజీ ఛైర్మన్ ప్రొఫెసర్. V.S చౌహాన్, ఏఐసీటీఈ ఛైర్మన్ సహస్రబుద్దే, యూజీసీ కార్యదర్శి రజనీష్ జైన్‌లు ఈ కమిటీలో ఉన్నారు. హాస్టల్ ఫీజుల పెంపుపై మెస్ లీడర్లతో చర్చలు జరపడానికి సిద్దంగా ఉన్నామని యూనివర్సిటీ అధికారులు తెలిపారు.