మమతా బెనర్జీ సంచలన వ్యాఖ్యలు

Update: 2019-11-19 15:42 GMT

బెంగాల్‌ రాజకీయాలు ఊహించని మలుపు తీసుకున్నాయి. హఠాత్తుగా మత ఉగ్రవాదం తెరపైకి వచ్చింది. స్వయంగా ముఖ్యమంత్రి మమతా బెనర్జీనే, మత ఉగ్రవాదాన్ని ప్రస్తావించారు. హిందువుల్లో తీవ్రవాదులు ఉన్నట్లే, ముస్లింలలోనూ తీవ్రవాదులు ఉన్నారని మమతా బెనర్జీ సంచలన వ్యాఖ్యలు చేశారు. మైనార్టీల్లో తీవ్రవాదులు పెరిగిపోతున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. ‌అతివాదశక్తుల పట్ల అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించారు.

కూచ్‌బిహార్‌లో నిర్వహించిన ఓ కార్యక్రమంలో మమతా బెనర్జీ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎంఐఎం పార్టీపై ఆమె పరోక్షంగా తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు. హైదరాబాద్ కేంద్రంగా నడుస్తున్న ఒక పార్టీ, సామాజికవర్గాల మధ్య విభేదాలు సృష్టిస్తోందని ఆరోపించారు. ఇలాంటి శక్తులను నమ్మకూడదని మైనార్టీలను కోరారు.

మమతా బెనర్జీ వ్యాఖ్యలపై అసదుద్దీన్ ఒవైసీ తీవ్రంగా స్పందించారు. బెంగాల్‌లో ఎంఐఎంకు కూడా ఆదరణ ఉందని దీదీనే ఒప్పు కున్నారని ఒవైసీ చురకలంటించారు. రాష్ట్రంలో బీజేపీ ఎదుగుదలను అడ్డుకోవడంలో దీదీ దారుణంగా విఫలమయ్యారని, ఆ కోపాన్ని తమపై చూపిస్తున్నారని మండిపడ్డారు.

Similar News