డిప్యూటీ సీఎం అజిత్ పవార్‌కు షాక్..!

Update: 2019-11-23 15:10 GMT

మహా పాలిటిక్స్‌కు ఇంకా తెరపడలేదు. బీజేపీ ప్రభుత్వం ఏర్పాటైనప్పటికీ అనిశ్చితి పూర్తి స్థాయిలో తొలగిపోలేదు. కమలదళం చేతిలో ఎదురుదెబ్బ తిన్న శివసేన, కాంగ్రెస్, ఎన్సీపీలు రివర్స్ షాక్ ఇవ్వడానికి సిద్ధమయ్యాయి. ఇప్పటికే డిప్యూటీ సీఎం అజిత్ పవార్‌కు షాక్ తగిలింది. తిరుగుబాటు ఎమ్మెల్యేలు అజిత్ పవార్‌ను వదిలి మళ్లీ శరద్ పవార్ వైపు వచ్చారు. ఎన్సీపీకీ మొత్తం 54 మంది ఎమ్మెల్యేలుండగా శరద్ పవార్ వైపు 50 మంది ఎమ్మెల్యేలు ఉన్నట్లు సమాచారం. అజిత్ పవార్ గ్రూప్‌లో నలుగురు శాసన సభ్యులే ఉన్నారని తెలుస్తోంది. ఇక, అజిత్ పవార్‌ సహా తిరుగుబాటు ఎమ్మెల్యేలపై వేటు వేయడానికి శరద్ పవార్ సిద్దమౌతున్నట్లు సమాచారం. ఇప్పటికే, అజిత్ పవార్‌కు సమన్లు వెళ్లాయి. డిప్యూటీ సీఎం పదవికి రాజీనామా చేయాలని శరద్ పవార్ అల్టిమేటమ్ జారీ చేశారు.

మరోవైపు, శివసేన కూడా న్యాయపోరాటం మొదలుపెట్టింది. మహారాష్ట్రలో తాజా రాజకీయాలపై సుప్రీంకోర్టును ఆశ్రయించింది. గవర్నర్ తీరు, బీజేపీ ప్రభుత్వ ఏర్పాటును సవాల్ చేస్తూ సర్వోన్నత న్యాయస్థానంలో రిట్ పిటిషన్ వేసింది. ప్రభుత్వ ఏర్పాటుకు గవర్నర్, ఫడ్నవిస్‌కు ఆహ్వానం పంపడంపై శివసేన, కాంగ్రెస్, ఎన్సీపీలు అభ్యంతరం తెలిపాయి. తమకు 144 మంది ఎమ్మెల్యేల మద్దతు ఉందని ఆ పిటిషన్‌లో పేర్కొన్నాయి. ప్రభుత్వ ఏర్పాటుకు శివసేన-ఎన్సీపీ-కాంగ్రెస్ కూటమిని ఆహ్వానించేలా ఆదేశాలు ఇవ్వాలని కోరాయి.

Similar News