మహారాష్ట్ర రాజకీయ సంక్షోభంపై సుప్రీం కోర్టులో వాదనలు ముగిశాయి. ఇరు వర్గాల వాదనలు విన్న సుప్రీం కోర్టు.. విచారణను సోమవారం ఉదయం 10 గంటల 30 నిమిషాలకు వాయిదా వేసింది. ఈ సందర్భంగా కేంద్రం, అజిత్ పవార్, ఫడ్నవీస్‌కు సుప్రీం నోటీసులు జారీచేసింది. వెంటనే గవర్నర్ మద్దతు లేఖలు అందజేయాలని ఆదేశించింది. గవర్నర్ మద్దతు లేఖలు క్షుణ్ణంగా పరిశీలించిన తరువాత బలపరీక్షపై సోమవారం తుది నిర్ణయం తీసుకుంటామని సుప్రీం స్పష్టం చేసింది. వెంటనే బలనిరూపణ అవసరం లేదని వెల్లడించింది.
బలపరీక్షపై సుప్రీం కోర్టులో వాడివేడి వాదనలు జరిగాయి. బీజేపీ తరపున ముకుల్ రోహత్గీ.. శివసేన, ఎన్సీపీ, కాంగ్రెస్ తరపున కపిల్ సిబాల్, అభిషేక్ సింఘ్వీ వాదించారు. రాత్రికి రాత్రే రాష్ట్రపతిపాలన ఎత్తేసి ఫడ్నవీస్ ప్రమాణస్వీకారం చేయాల్సిన అవసరం ఏముందని ప్రశ్నించారు కపిల్ సిబాల్. గవర్నర్ ఏక పక్షంగా వ్యవహరిస్తున్నారన్న ఆయన.. అధికార పార్టీ ఆదేశాల ప్రకారం గవర్నర్ వ్యవహరిస్తున్నారని అన్నారు. అసెంబ్లీలో బల నిరూపణకు తాము సిద్ధమని వాదించారు కపిల్ సిబాల్. అటు ఆదివారమే బలపరీక్ష నిర్వహించాలని అన్నారు అభిషేక్ సింఘ్వీ. గవర్నర్‌కు తప్పుడు ధృవపత్రాలు ఇచ్చారన్న సింఘ్వీ... అజిత్ పవార్ ఇచ్చిన లేఖ చెల్లదన్నారు.
అటు ప్రభుత్వం తరపున ముకుల్ రోహత్గీ గట్టిగా వాదనలు వినిపించారు. 17రోజులు సమయం ఇచ్చినా శివసేన, ఎన్సీపీ, కాంగ్రెస్ ఎందుకు ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయలేదని ఆయన ప్రశ్నించారు. వెంటనే విశ్వాస పరీక్ష అవసరం లేదని... బలపరీక్షకు మరింత సమయం కావాలని కోరారు. మహారాష్ట్రలో ప్రభుత్వం ఏర్పాటైనందున అత్యవసర విచారణ అవసరం లేదన్నారు. హైకోర్టును ఆశ్రయించకుండా నేరుగా సుప్రీంను ఎందుకు ఆశ్రయించారని ముకుల్ రోహత్గీ ప్రశ్నించారు.