అనంతపురం జిల్లా హిందూపురం MGM గ్రౌండ్స్‌లో ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ కుటుంబ సభ్యుల ఆధ్వర్యంలో కార్తీక దీపోత్సవం వైభవంగా నిర్వహించారు. కార్తీక మాసం చివరి సోమవారం సందర్భంగా తలపెట్టిన ఈ కార్యక్రమానికి వేలాది మంది మహిళలు తరలివచ్చారు. సంప్రదాయబద్దంగా వేద పండితుల మంత్రోచ్ఛరణల మధ్య పూజా కార్యక్రమాలు జరిగాయి. బాలకృష్ణ, నారా లోకేష్, భరత్ దంపతులు ఇతర కుటుంబ సభ్యులతో కలిసి కార్తీక దీపారాధన చేశారు.
రాష్ట్ర ప్రజలు సుఖ సంతోషాలతో ఉండాలని ఆకాంక్షిస్తూ ఈ కార్తీక దీపోత్సవాన్ని నిర్వహించినట్లు బాలకృష్ణ కుటుంబ సభ్యులు తెలిపారు. జ్యోతిర్లింగాల ప్రదర్శన మధ్య ఈ దీపోత్సవం.. రాత్రి పొద్దుపోయే వరకు అట్టహాసంగా జరిగింది. వేద పండితులు మాడుగుల నాగఫణి శర్మ అనుగ్రహ భాషణం చేశారు. కార్తీక మాసం, దీపోత్సవం విశిష్టతను భక్తులకు వివరించారు.
ఆ తర్వాత భక్తులంతా కార్తీక దీపోత్సవంలో భాగమయ్యారు. మహిళలంతా కార్తీక దీపాలను వెలిగించి కార్తీక దామోదరుణ్ని ప్రార్థించారు. ఈ సందర్భంగా శివనామస్మరణ మారుమోగేలా భక్తి పాటలు, సెట్టింగ్స్ హైలెట్‌గా నిలిచాయి. అటు.. చిన్నారులు నిర్వహించిన సాంస్కృతిక కార్యక్రమాలు హిందూపురం వాసులను భక్తిపారవశ్యంలో ముంచెత్తాయి.