ఇటీవల జరిగిన ఒక సంఘటన బాలీవుడ్ హిట్ మూవీ 'హమ్ దిల్ దే చుకే సనమ్' తలపిస్తోంది. ఆ సినిమాలో హీరో హీరోయిన్ సల్మాన్ ఖాన్, ఐశ్వర్య రాయి. వీరిద్దరూ ప్రేమించుకుంటారు. కానీ, ఐశ్వర్య తండ్రి సల్మాన్‌తో కాకుండా.. అజయ్ దేవ్‌గణ్‌తో వివాహం జరిపిస్తాడు. పెళ్లి తర్వాత సల్మాన్ గురించి తెలుసుకున్న అజయ్.. ఐశ్వర్యను సల్మాన్‌కిచ్చి పెళ్లి చేయాలనుకుంటాడు. కానీ, తన భర్త చూపిస్తున్న ప్రేమను అర్థం చేసుకొని సల్మాన్‌ని పెళ్లి చేసుకోవడానికి నిరాకరించి ఐశ్వర్య.. అజయ్ తోనే ఉంటుంది. తెలుగులో శ్రీకాంత్, రచన నటించిన 'కన్యాదానం' సినిమా కూడా ఇంచుమించు అలాగే ఉంటుంది. ఇప్పుడీ స్టోరీల లాగే మధ్యప్రదేశ్ లో కూడా జరిగింది. అయితే భార్య రెండో పెళ్ళికి సిద్ధమైంది. భోపాల్ కు చెందిన సాఫ్ట్‌వేర్ ఇంజనీర్ మహేష్‌తో..ఫ్యాషన్ డిజైనర్ సంగీతకి ఏడేళ్ల క్రితం వివాహమైంది.
వీరికి ఇద్దరు పిల్లలు కూడా ఉన్నారు. వీరిద్దరూ ఇప్పుడు విడిపోవాలని విడాకులకు అప్లై చేసుకున్నారు. దీనికి కారణం ఏంటంటే సంగీతకు పెళ్ళికి ముందే మరో వ్యక్తితో ప్రేమ వ్యవహారం ఉంది. ఆ సమయంలో ఆమె తండ్రి ప్రేమికుడితో పెళ్లికి ఒప్పుకోలేదు. దాంతో చేసేదేమి లేక మహేష్ ను వివాహం చేసుకుంది ఆమె. అయితే ఏడేళ్ల తరువాత కూడా సంగీతను మరచిపోలేదు ఆమె ప్రియుడు. ఆమెకోసమే ఆలోచిస్తూ పెళ్లి చేసుకోలేదు. ఈ విషయం సంగీతకు తెలిసి.. ప్రేమికుడి చెంతకు చేరాలని నిర్ణయించుకుంది. ఈ విషయాన్ని భర్తకు చెప్పగా అతను మొదట నిరాకరించాడు. ఆ తరువాత భార్య మనసును అర్ధం చేసుకొని ఒప్పుకున్నాడు. అంతేకాదు పిల్లల్ని కూడా తానే చూసుకుంటునని ఆమెకు హామీ ఇచ్చాడు. ఈ క్రమంలో ఇద్దరు పరస్పరం అంగీకారంతో కోర్టులో విడాకుల పిటిషన్ దాఖలు చేశారు.