హైదరాబాద్ బయోడైవర్సిటీ కారు ప్రమాద బాధితురాలి ఆపరేషన్ సాయం కోసం ముందుకొచ్చారు ఏపీ సీఎం జగన్. ఈ ప్రమాదంలో ఓ మహిళ అక్కడికక్కడే మృతి చెందగా.. అనంతపురానికి చెందిన కుబ్రా బేగం అనే మరో యువతి తీవ్ర గాయాలతో ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. కుబ్రా బేగంకు ఆపరేషన్ చేయాలని.. అందుకు 5 లక్షల ఖర్చు అవుతుందని డాక్టర్లు చెప్పారు. దీంతో సాధారణ పెయింటర్‌గా పని చేసే బేగం తండ్రి అంత డబ్బు చెల్లించే స్థోమత లేక సాయం కోసం దీనంగా ఎదురు చూస్తున్నాడు.
ఈ విషయం సీఎం జగన్ దృష్టికి వెళ్లటంతో వెంటనే సానుకూలంగా స్పందించారు. కుబ్రా బేగం ఆపరేషన్‌కు సాయం చేసేందుకు ముందుకొచ్చారు. ఎంత డబ్బు ఖర్చైనా పర్వాలేదని.. వెంటనే ఆపరేషన్ కోసం అవసరమయ్యే డబ్బును ముఖ్యమంత్రి సహాయనిధి ద్వారా అందజేయాలని అధికారులను ఆదేశించారు. యువతి సాధారణ స్థితి చేరుకునే వరకు అండగా ఉంటామని హామీ ఇచ్చారు.
తమ కూతురు కోసం సీఎం జగన్ సాయం చేసేందుకు ముందుకు వచ్చిన విషయం తెలుసుకున్న బాధితురాలి తల్లిదండ్రులు ఉద్వేగానికి లోనయ్యారు. దిక్కుతోచని స్థితిలో ఉన్న తమను ఆదుకున్న ముఖ్యమంత్రికి.. వారు కృతజ్ఞతలు తెలిపారు.