ఏపీ మంత్రివర్గ సమావేశం బుధవారం జరగనుంది. సచివాలయంలో సీఎం జగన్ అధ్యక్షతన జరిగే ఈ సమావేశంలో కీలక అంశాలపై చర్చ జరగనుంది. రాష్ట్రవ్యాప్తంగా ప్రతిపక్ష పార్టీలు లేవనెత్తుతున్న ఇసుక, ఇంగ్లీష్ మాధ్యమం, మతపరమైన అంశాలను కట్టడి చేసేందుకు అవసరమైతే చట్ట సవరణ తీసుకురావాలనే యోచనలో ప్రభుత్వం ఉన్నట్లు సమాచారం. అలాగే అన్యమత ప్రచారంపై వస్తున్న ఆరోపణలను సమర్థవంతంగా తిప్పికొట్టడంతో పాటు భవిష్యత్తులో నిరాధార ఆరోపణలకు తావులేకుండా కట్టుదిట్టమైన చర్యలు చేపట్టాలని భావిస్తోంది.
ఇక నూతన ఇసుక విధానంపైనా.. సీఎం జగన్ సమీక్ష జరపనున్నారు. ప్రస్తుతం వరద పూర్తిస్థాయిలో తగ్గి ఇసుక లభ్యత ఉన్నందున రవాణా, ధరలు సహా అనేక అంశాలు సమావేశంలో ప్రస్తావనకు రానున్నాయి. అలాగే బార్ల సంఖ్యను తగ్గిస్తూ మద్యం ధరలు పెంచుతూ ఇటీవల ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. నిర్ణీత వేళలకే విక్రయాలు నిర్దేశిస్తూ ఇటీవల తీసుకున్న నిర్ణయాలను.. మంత్రివర్గ సమావేశంలో ఆమోదించనున్నారు. వచ్చేనెల 9 నుంచి అసెంబ్లీ సమావేశాలు నిర్వహించాలని నిర్ణయించిన నేపథ్యంలో కేబినెట్ భేటీలో తుది నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. ఇక నవరత్నాల్లో భాగంగా ఇప్పటి వరకు అమలు చేసిన సంక్షేమ పథకాలు, భవిష్యత్తులో చేపట్టాల్సిన కార్యక్రమాలపైనా కేబినెట్ భేటీలో చర్చించనున్నారు. పేద, బలహీన వర్గాలకు అమలు చేస్తున్న ఆర్థిక సాయంపై చర్చించడంతోపాటు కేంద్రం నుంచి రావాల్సిన నిధుల సమీకరణకు అనుసరించాల్సిన వ్యూహాలు, శాఖల వారీగా ఆర్థిక క్రమశిక్షణ వంటి అనేక అంశాలపై సమావేశంలో చర్చించనున్నారు.