ఫిషర్ మెన్‌ కో-ఆపరేటివ్‌ సొసైటీ ఎన్నికల ఫలితాల్లో గందరగోళం

Update: 2019-11-28 01:58 GMT

 

తూర్పుగోదావరి జిల్లా జగ్గంపేట కాట్రావులపల్లి ఫిషర్ మెన్‌ కో-ఆపరేటివ్‌ సొసైటీ ఎన్నికల ఫలితాలపై గందరగోళం నెలకొంది. ఫలితాలు తారుమారు చేసే కుట్ర జరుగుతోందంటూ మరో వర్గానికి చెందినవారు ఆందోళనకు దిగారు. ఎన్నికల అధికారి తీరును కూడా వారు తప్పు పడుతున్నారు. ఎన్నికల నియమావళికి విరుద్ధంగా పనిచేస్తున్నారంటూ ఆందోళన బాట పట్టారు. సదరు అధికారిపై తక్షణమే చర్యలు తీసుకోవాలని స్థానికుల డిమాండ్‌ చేస్తున్నారు.

కాట్రావులపల్లి ఫిషర్‌ మెన్‌ కో ఆపరేటివ్‌ సొసైటీలో మొత్తం 9 మంది డైరెక్టర్ల ఎన్నికకు సంబంధించి పోలింగ్‌ నిర్వహించారు. మొత్తం 385 ఓట్లు ఉండగా.. 359 ఓట్లు పోలయ్యాయి. పోలింగ్‌ ప్రక్రియ అంతా ప్రశాంతంగానే జరిగింది. కౌంటింగ్‌ నుంచే రగడ మొదలైంది. కౌంటింగ్‌ అనంతరం అధికార పార్టీకి చెందిన వర్గం.. ఒక డైరెక్టర్‌ మాత్రమే గెలుచుకోగా.. ప్రత్యర్థి వర్గం ఎనిమిది మంది డైరెక్టర్లను కైవసం చేసుకుంది. ఈ ఫలితాలపై అధికార పార్టీ నేతలు అభ్యంతరం వ్యక్తం చేశారు. రీ కౌంటింగ్‌కు డిమాండ్‌ చేశారు. రీ కౌంటింగ్‌ తర్వాత అధికార పార్టీకి చెందిన వర్గానికి ఇద్దరు డైరెక్టర్లు రాగా.. ప్రత్యర్థి వర్గం డైరెక్టర్ల సంఖ్య ఆరుకు చేరింది. మిగిలిన ఒక డైరెక్టర్‌ ఎన్నికకు సంబంధించి ఇప్పుడు రగడ నడుస్తోంది.

ఎన్నికల అధికారి లక్ష్మణరావు వ్యవహరించిన తీరు దుమారం రేపుతోంది. టీడీపీకి చెందిన ఆరుగురు డైరెక్టర్ల సంతకాలు తీసుకుని ఆయన అక్కడ్నుంచి వెళ్లిపోయారు. తుది ఫలితాన్ని వెలువరించకుండా శుక్రవారానికి వాయిదా వేయడంపై ప్రత్యర్థి వర్గం ఆందోళన వ్యక్తం చేస్తోంది. ఫలితాలను తారుమారు చేయడం కోసమే వాయిదా వేశారని ఆరోపిస్తోంది.

Similar News