షాద్‌నగర్‌లో వైద్యురాలిపై హత్యాచార ఘటనను లోక్‌సభ తీవ్రంగా ఖండించింది. ఇలాంటి ఘటనలపై కఠిన చర్యలు తీసుకుంటామని, అన్ని పార్టీలు అంగీకరిస్తే బలమైన చట్టం తీసుకురావడానికి కేంద్ర ప్రభుత్వం సిద్ధంగా ఉందని రక్షణమంత్రి రాజ్‌నాథ్ సింగ్ ప్రకటించారు. హత్యాచార నిందితులకు 30 రోజుల్లోగా కఠిన శిక్ష అమలు చేయాలని టీఆర్ఎస్ ఎంపీ నామా నాగేశ్వరావు అన్నారు.
దిశ హత్యోదంతాన్ని రాజ్యసభ ముక్తకంఠంతో ఖండించింది. లైంగిక దాడి నిందితులకు మరణశిక్షే సరైందని తేల్చి చెప్పింది. దోషులను వేగంగా శిక్షించినప్పుడే ఇలాంటి ఘటనలను నిలువరించగలమని రాజ్యసభ సభ్యులు అభిప్రాయపడ్డారు. కోర్టులు, చట్టాలతో మాత్రమే న్యాయం జరగదని, సమాజంలో మార్పు కూడా రావాల్సిన అవసరముందన్నారు. తల్లిదండ్రులు పిల్లలకు నైతిక విలువలు బోధించి, వారు సన్మార్గంలో నడిచేలా చూసుకోవాలని సూచించారు.