శాంతమూర్తిగా ఉన్న లక్ష్మీ నరసింహస్వామి.. ఉగ్రరూపం

Update: 2019-12-04 05:17 GMT

యాదాద్రి శ్రీ లక్ష్మీనరసింహస్వామి దేవాలయం స్వయంభు ఉత్సవమూర్తి రూపం మార్చారంటూ వస్తున్న వార్తలు సంచలనం సృష్టిస్తున్నాయి. శాంతమూర్తిగా ఉన్న లక్ష్మీ నరసింహ స్వామికి.. ఉగ్రరూపం వచ్చేలా మార్పులు చేశారని కొందరు ఆరోపిస్తున్నారు. యాదాద్రి పునర్నిర్మాణ పనుల్లో కీలకంగా వ్యవహరించిన సుందరరాజన్ ఈ ప్రచారాన్ని కొట్టిపారేశారు. ఉత్సవమూర్తికి కొన్ని దశాబ్దాలుగా సింధూరం పూయడం వల్ల విగ్రహంపై అది మందంగా అంటుకుని ఉండిపోయిందని వివరిస్తున్నారు. మూలవిరాట్ వాస్తవ రూపం కొంత మేర కనిపించకుండా ఉండడానికి ఈ సింధూరమే కారణమని అంటున్నారు. ఈ క్రమంలోనే ప్రధాన అర్చకులు, ఇతర సిబ్బంది సమక్షంలో మూలవిరాట్ ఉత్సవమూర్తి మీద ఉన్న సింధూరం తొలగించామని సుందరరాజన్‌ స్పష్టం చేశారు.

ప్రధాన ఆలయంలోని మూలవిరాట్‌కు మార్పులు చేర్పులు చేశారని ప్రచారం జరుగుతుండడంతో.. యాదాద్రి ఆలయ ప్రధాన అర్చకులు శ్రీ లక్ష్మీ నరసింహాచార్యులు దీనిపై స్పందించారు. అలాగే ఆలయ ఈవో గీతా రెడ్డి, వైస్ ఛైర్మన్ కిషన్‌రావు, ఆర్కిటెక్ట్ ఆనందసాయి కూడా దీన్ని తీవ్రంగా ఖండించారు. ప్రతిరోజు మూలవిరాట్‌కి నైవేద్యం ప్రత్యేక పూజలు చేసిన తర్వాతే ప్రస్తుత బాల ఆలయంలో పూజాదికాలు నిర్వహిస్తున్నారు. ప్రస్తుతం పనులు జరుగుతున్న ప్రధాన ఆలయంలోని మూల విరాట్ ప్రాంతంలోకి ప్రధాన అర్చకులు, అర్చకులకు మాత్రమే అనుమతి ఉంటుంది. అసలు ఏం జరిగింది అనేది వారు చెబితే మాత్రమే బయటికి తెలిసే అవకాశం ఉంది.

యాదాద్రి క్షేత్రంలో శ్రీలక్ష్మీ నరసింహస్వామి శాంత రూపంలో దర్శనమిస్తుంటారు. కానీ ఇప్పుడు స్వామి వారి నాలుక పెద్దదయిందని.. తలపై ఏడు పడగల ఆదిశేషుడిని ప్రస్తుతం ఐదు పడగలకు కుదించారనీ.. కోరలు బయటకు కనిపిస్తు ఉగ్రరూపం మాదిరిగా దర్శనమిస్తున్నాడని జోరుగా ప్రచారం జరుగుతోంది.

గతంలో యాదాద్రి ఆలయం చుట్టూ ఉన్న మండపంలో తెలంగాణ చరిత్ర, రాజకీయ నాయకుల చిత్రాలు.. స్తంభాలపై చెక్కడం వివాదంగా మారిన సంగతి తెలిసిందే. ఇప్పుడు.. శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి వారి మూలవిరాట్ విగ్రహం మార్పులు చేర్పులు చేశారనే దానిపై వార్తలు రావడంతో.. ఆలయ పూజారులు, అధికారులు దీన్ని ఖండిస్తున్నారు. భక్తులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని శాస్త్ర నియమాలకు విరుద్ధంగా ఏ పనులు జరగడం లేదని స్పష్టం చేస్తున్నారు.

Similar News