మోదీ ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా భావించిన పౌరసత్వ చట్ట సవరణ బిల్లు-2019ని పార్లమెంట్‌లో ఆమోదింపజేసుకుంది. బిల్లుకు అనుకూలంగా 125 మంది .. వ్యతిరేకంగా 105 మంది ఓటు వేశారు. ఓటింగ్ సమయంలో సభలో మొత్తం 230 మంది సభ్యులున్నారు. మరో 10 మంది సభ్యులు గైర్హాజరయ్యారు. ఇప్పటికే క్యాబ్ బిల్లు లోక్‌సభ ఆమోదం పొందింది. ఇక రాష్ట్రపతి ఆమోదముద్ర వేయడం లాంఛనమే.. ఆ తర్వాత క్యాబ్ చట్టరూపంలోకి వస్తుంది. పౌరసత్వ బిల్లుకు లోక్‌సభలో మద్దతు ఇచ్చిన శివసేన రాజ్యసభలో మాత్రం వాకౌట్ చేసింది.
బిల్లును సెలక్ట్ కమిటీకి పంపాలన్న విపక్షాల డిమాండ్‌ను రాజ్యసభ తిరస్కరించింది. సెలెక్ట్ కమిటీకి పంపే అంశంపై ఓటింగ్ నిర్వహించారు. సెలక్ట్ కమిటీకి పంపాలంటూ 99 మంది, అవసరం లేదంటూ.. 124 మంది ఓటు వేశారు.
ఆ తర్వాత విపక్షాలు ప్రతిపాదించిన సవరణలపైనా ఓటింగ్ జరిగింది. బిల్లుకు మొత్తం 43 సవరణలు ప్రతిపాదించారు. ఇవన్నీ వీగిపోయాయి. వీటిలో కొన్నింటిని మూజువాణి ఓటుతో తిరస్కరించగా.. మరికొన్ని సవరణలకు ఓటింగ్ నిర్వహించారు.