ప్రగతి భవన్‌లో సీఎం కేసీఆర్ అధ్యక్షతన మంత్రివర్గ సమావేశం.. చర్చించే అంశాలివే..
బుధవారం సాయంత్రం 5 గంటలకు ప్రగతి భవన్‌లో సీఎం కేసీఆర్ అధ్యక్షతన మంత్రివర్గ సమావేశం కానుంది. ఈ సమావేశంలో ఇరిగేషన్, రెవెన్యూ, ఆర్టీసీ, ఆర్ధిక పరిస్థితులు ఇలా మొత్తం 30 అంశాలపై చర్చించనున్నారు. కేంద్రం నుంచి రాష్ట్రానికి రావాల్సిన బాకాయి నిధులపై ఇక అమి తుమీ తేల్చుకోవాలని ప్రభుత్వం ఇప్పటికే నిర్ణయించుకుంది. సమావేశంలో రాష్ట్ర ఆర్ధిక పరిస్థితిపై కేబినెట్ పూర్తిస్థాయిలో చర్చించనుంది. అన్ని శాఖలను సమీక్షించి గత ఐదేళ్లలో కేంద్రం నుంచి రావాల్సిన నిధులు ఎన్ని..ఇప్పటివరకు కేటాయించిన నిధులు ఎన్ని లెక్క తేల్చనున్నారు. అనంతరం నిధుల కోతపై కేంద్రంతో తేల్చుకునేందుకు సీఎం కేసిఆర్ ఢిల్లీ బాట పట్టనున్నారు. నిధుల పంచాయితీని ప్రధాని మోదీతోనే తేల్చుకోవాలని సీఎం కేసిఆర్ భావిస్తున్నారు. ఇందుకోసం ప్రధాని అపాయింట్మెంట్ కోసం కూడా ప్రయత్నిస్తున్నారు.
కొత్త రెవెన్యూ చట్టంపై కూడా మంత్రివర్గం సుదీర్ఘంగా చర్చించే ఆవకాశం ఉంది. రైతులకు ఎలాంటి ఇబ్బంది లేకుండా, అవినీతికి ఆస్కారం లేని పారదర్శకమైన రెవెన్యూ చట్టాన్ని తీసుకొస్తామని సీఎం కేసీఆర్ కొంతకాలంగా చెబుతున్నారు. ఈ నేపథ్యంలో రెవెన్యూ చట్టంపై కీలక నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉంది. రెవెన్యూ చట్టం మంత్రివర్గం ఆమోదం పొందితే ప్రత్యేకంగా శాసనసభ సమావేశాలు నిర్వహించే అవకాశాలు ఉన్నాయి. న్యాయపరమైన చిక్కులు ఎదురవ్వకుండా చివరగా అన్ని అంశాలను కేబినెట్ చర్చించనున్నారు.
ఇరిగేషన్ శాఖకు సంబంధించి కీలక నిర్ణయాలు తీసుకునే అవకాశాలున్నాయి. ఇటీవల సీఎం కేసీఆర్ నిర్వహించిన ఇరిగేషన్ సమీక్షలో సాగునీటి సరఫరా, ప్రాజెక్టులకు సంబంధించి కొత్త పనులు చేపట్టాలని నిర్ణయించారు. దుమ్ముగూడెం వద్ధ 37 టీఎంసీల నీటి నిల్వ సామర్థ్యంతో పాటు 320 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి లక్ష్యంగా ఆనకట్ట నిర్మించాలనే యోచనలో ఉన్నారు సీఎం. వీటిపై కేబినెట్ లో చర్చింది తుది నిర్ణయం తీసుకోనున్నారు.
ఇక ఆర్టీసీకి సంబంధించి కార్మికుల విషయంలో ముఖ్యమంత్రి కేసీఆర్ ఇప్పటికే పలు హామీలు ఇచ్చారు. గత ఆదివారం కార్మికులతో భేటీ సందర్భంగా వరాలు కురిపించారు. రిటైర్మెంట్ వయస్సు పెంపు లాంటి కీలక హామీలపై కేబినెట్ లో చర్చించి ఆమోదం తెలపనున్నారు.