ఏసీబీకి చిక్కిన మరో అవినీతి తిమింగలం

Update: 2019-12-13 04:20 GMT

ఏసీబీ వలలో మరో అవినీతి తిమింగలం పడింది. ఓ అపార్ట్‌మెంట్‌కు ట్రాన్స్‌ఫార్మర్‌, ప్యానల్‌ బోర్డులను మంజూరు చేసేందుకు 25వేలు డిమాండ్‌ చేశాడో విద్యుత్‌ శాఖ డీఈ. మణికొండకు చెందిన మైలారపు శివకుమార్‌రెడ్డి అనే కాంట్రాక్టర్‌ నుంచి 25వేలు లంచం తీసుకుంటుండగా డీఈ వెంకటరమణ ఏసీబీకి చిక్కాడు. నానల్‌నగర్‌లోని విద్యుత్‌ శాఖ కార్యాలయంలో ఈ ఘటన జరిగింది. తనిఖీలు నిర్వహించిన అధికారులు కొన్ని ఫైళ్లను సీజ్‌ చేశారు.

అనంతరం ఏసీబీ అధికారులు ఈ అవినీతి అధికారి ఇంటిపై దాడులు నిర్వహించారు. మాదాపూర్‌ మీనాక్షి టవర్‌లోని ప్లాట్‌లో సోదాలు జరిపారు. పెద్ద ఎత్తున బంగారు, వెండి ఆభరణాలు, ఖరీదైన చేతి గడియారాలు, ఎలక్ట్రానిక్‌ ఉపకరణాలు, కట్టల కొద్ది నగదు గుర్తించారు. అర్ధరాత్రి వరకు జరిగిన ఈ సోదాల్లో వెంకటరమణ అవినీతి చిట్టా బయటపడింది. 60 తులాల బంగారు, వెండి ఆభరణాలతో పాటు 26లక్షల లక్షల నగదు, విలువైన ఆస్తి పత్రాలు గుర్తించారు. మొత్తం సొత్తు విలువ మూడున్నర కోట్లు ఉంటుందని ఏసీబీ అధికారులు అంచనా వేశారు.

Similar News