మంగళవారం యాదాద్రిలో సీఎం కేసీఆర్ పర్యటన

Update: 2019-12-17 01:20 GMT

సీఎం కేసీఆర్ మంగళవారం యాదాద్రిలో పర్యటించనున్నారు. యాదాద్రి ఆలయ పునఃనిర్మాణాన్ని ప్రతిష్టాత్మకంగా తీసుకున్న కేసీఆర్.. దేవాలయ అభివృద్ధి పనులు ఎక్కడి వరకు వచ్చాయో తెలుసుకునేందుకు యాదాద్రికి వెళ్లనున్నారు. మొదటగా బాలాలయంలో లక్ష్మీనరసింహస్వామిని దర్శించుకుంటారు. అనంతరం ఆలయ నిర్మాణ పనులను స్వయంగా కలియ తిరిగి పరిశీలించనున్నారు. తర్వాత ఆలయ పనుల పురోగతిపై దేవాలయ అధికారులు, శిల్పులతో సమీక్ష నిర్వహించనున్నారు కేసీఆర్.

ఆలయ నిర్మాణ పనులతో పాటు.. యాదాద్రిలో రాష్ట్రపతి, ఇతర ప్రముఖుల కోసం నిర్మిస్తున్న కాటేజీలను కూడా సీఎం సందర్శిస్తారు. అనంతరం ఫిబ్రవరిలో జరిగే ఆలయ ప్రారంభోత్సవం సందర్భంగా యాదాద్రిలో మహాసుదర్శన యాగం నిర్వహించాలని సీఎం ఇప్పటికే నిర్ణయించారు. దీనికి అనువైన ప్రాంతాన్ని ఎంపిక చేయనున్నారు. ఆలయ ప్రారంభోత్సవానికి ముందు జరిగే కేసీఆర్ పర్యటనపై ప్రాధాన్యం సంతరించుకుంది. ఉదయం 11 గంటలకు వెళ్లి సాయంత్రం వరకు యాదాద్రిలోనే ఉండనున్నారని తెలుస్తోంది.

మరోవైపు సీఎం పర్యటన నేపథ్యంలో శిల్పులు, కార్మికులు పనుల్లో ఇంకాస్త స్పీడ్‌ పెంచారు. గడువులోగా యాదాద్రి పనులను పూర్తి చేయడమే లక్ష్యంగా పని చేస్తున్నారు. ఇప్పటికే లోపలి ప్రాకారంలో ఫ్లోరింగ్ పనులు పూర్తయ్యాయి. బయటి ప్రాకారంలో ఫ్లోరింగ్ పనులు శరవేగంగా జరుగుతున్నాయి. సప్తగోపురాల సముదాయం, అష్టభుజి మండపాలతో కూడిన దక్షిణ, పడమర గోపురాలు కనువిందు చేస్తున్నాయి. లోపలి ప్రాకారంలో అద్దాల మండపం సిద్దమవుతోంది. ప్రహ్లాద చరిత్ర ఘట్టాలను గర్భాలయ గోడలకు శిల్పులు అమర్చుతున్నారు. యాదాద్రి లోపలి ప్రాకారంలో మాడవీధులున్నాయి.

 

Similar News