హైదరాబాద్‌లో అమెరికా-భారత్‌ రక్షణ సంబంధాలపై సదస్సు

Update: 2019-12-19 02:05 GMT

హైదరాబాద్‌లో అమెరికా భారత్‌ రక్షణ సంబంధాలపై రెండ్రోజుల సదస్సు ప్రారంభమైంది. యూఎస్‌ కాన్సులేట్‌ జనరల్‌ ఆధ్వర్యంలో యూఎస్‌-ఇండియా డిఫెన్స్‌ ఒప్పందాలపై జరుగుతున్న ఈ సదస్సుకు ఐటీ మంత్రి కేటీఆర్‌ ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. రక్షణ రంగంలో హైదరాబాద్ ప్రాధాన్యతను గుర్తుచేశారు. అంతేకాదు..రాష్ట్రం సాధిస్తున్న అభివృద్ధిని వివరించారు. దేశంలో వేగంగా అభివృద్ధి చెందుతున్న రాష్ట్రం తెలంగాణ అని అన్నారు. ఈజ్‌ ఆఫ్‌ డూయింగ్‌ బిజినెస్‌లో రాష్ట్రం నెంబర్‌వన్‌లో కొనసాగుతోందన్నారు. టీఎస్‌ఐపాస్‌ ద్వారా కంపెనీలకు 15 రోజుల్లోనే అనుమతులు ఇస్తున్నామన్నారు మంత్రి కేటీఆర్.

దేశంలోనే హైదరాబాద్ డిఫెన్స్ హబ్ అని అన్నారు కేటీఆర్. దేశరక్షణ రంగానికి అవసరమైన ఉత్పత్తులకు సంబంధించి 22 శాతం హైదరాబాదే తీరుస్తుందన్నారు. త్వరలోనే వరల్డ్‌ క్లాస్‌ డిఫెన్స్‌ యూనివర్సిటీ హైదరాబాద్‌లో ఏర్పాటు చేస్తామని ప్రకటించారు.

అమెరికా- భారత్ మధ్య రక్షణ రంగ వాణిజ్యం ప్రధాన్యతను వివరించిన కేటీఆర్..రెండు దేశాల మధ్య రక్షణ రంగ వాణిజ్యం 18 మిలియన్‌ డాలర్లుకు చేరిందని గుర్తు చేశారు. టీఎస్‌ఐపాస్‌ ద్వారా ఐదేళ్లలో రాష్ట్రంలో అనేక పరిశ్రమలు ఏర్పాటయ్యాయని వివరించారు కేటీఆర్. అమెజాన్‌ వంటి పెద్ద సంస్థలు హైదరాబాద్‌కు వచ్చాయన్నారు. తెలంగాణ ఆకాడమీ ఆఫ్‌ స్కిల్స్‌ ద్వారా యువతకు ప్రత్యేక శిక్షణలు ఇస్తున్నామని వివరించారు.

Similar News