December Deadline: డిసెంబర్ 31 డెడ్‌లైన్..త్వరగా ఈ 2 ముఖ్యమైన పనులు పూర్తి చేయండి..లేదంటే భారీ జరిమానా తప్పదు.
December Deadline: డిసెంబర్ 2025 నెల చివరి దశకు చేరుకోవడంతో కొన్ని అత్యవసరమైన ఆర్థిక పనులను పూర్తి చేయడానికి గడువు దగ్గర పడింది. అందులో మొదటిది.. అత్యంత ముఖ్యమైనది – ఆలస్యమైన ఆదాయపు పన్ను రిటర్న్ దాఖలు చేయడం. మీరు ఆర్థిక సంవత్సరం 2024-25 కు సంబంధించిన ఆదాయపు పన్ను రిటర్న్‌ను ఇంకా దాఖలు చేయకపోతే, డిసెంబర్ 31, 2025 వరకు మాత్రమే చివరి అవకాశం ఉంది. ఈ తేదీ తర్వాత మీరు రిటర్న్ ఫైల్ చేయలేరు.
ఆలస్యంగా రిటర్న్ దాఖలు చేస్తే ఆలస్య రుసుము చెల్లించాల్సి ఉంటుంది. మీ వార్షిక ఆదాయం రూ.5 లక్షల లోపు ఉంటే, రూ.1,000 ఆలస్య రుసుము చెల్లించాలి. ఆదాయం రూ.5 లక్షలు లేదా అంతకంటే ఎక్కువ ఉంటే, రూ.5,000 ఆలస్య రుసుము చెల్లించాల్సి వస్తుంది. ఒకవేళ మీరు ఈ డెడ్‌లైన్ కూడా దాటినా రిటర్న్ దాఖలు చేయకపోతే, రిఫండ్‌లు ఆగిపోవడం, పన్ను చట్టం ప్రకారం జరిమానాతో పాటు అధిక వడ్డీ చెల్లించాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. అంతేకాకుండా మీ ఆర్థిక రికార్డు బలహీనపడి, భవిష్యత్తులో లోన్లు తీసుకోవడం, క్రెడిట్ స్కోర్, వీసా దరఖాస్తులపై కూడా ప్రతికూల ప్రభావం పడే అవకాశం ఉంది.
ఆధార్, పాన్ లింకింగ్
డిసెంబర్ 31 లోపు పూర్తి చేయవలసిన రెండవ అత్యంత కీలకమైన పని ఆధార్ కార్డును పాన్ కార్డుతో లింక్ చేయడం. మీరు అక్టోబర్ 1, 2024 లేదా అంతకంటే ముందు ఆధార్ కార్డు పొంది, దానిని పాన్ కార్డుతో లింక్ చేయకపోతే, డిసెంబర్ 31, 2025 లోపు ఈ పనిని పూర్తి చేయాలి. లేదంటే, మీ పాన్ కార్డు ఇన్ యాక్టివ్ గా మారే ప్రమాదం ఉంది.
పాన్ కార్డు నిష్క్రియం అయితే, బ్యాంకింగ్, పెట్టుబడి, ITR ఫైలింగ్ వంటి పన్ను సంబంధిత ముఖ్యమైన ఆర్థిక లావాదేవీలన్నీ ఆగిపోతాయి. పాన్-ఆధార్ లింకింగ్ ప్రక్రియ చాలా సులభం. మీరు ఆదాయపు పన్ను ఈ-ఫైలింగ్ వెబ్‌సైట్ ద్వారా లేదా ఎస్సెమ్మెస్ ద్వారా కొన్ని సులభమైన దశల్లో ఈ పనిని పూర్తి చేయవచ్చు. పాన్ నంబర్, ఆధార్ నంబర్, మొబైల్‌కు వచ్చే OTP ద్వారా లింకింగ్ చేయవచ్చు. ప్రస్తుతం ఏదైనా పెనాల్టీ వర్తిస్తే, దానిని ఆన్‌లైన్‌లో చెల్లించవచ్చు. కాబట్టి ఆర్థిక సమస్యలు రాకుండా ఉండాలంటే ఈ రెండు పనులను ఈ నెల ఆఖరులోపు తప్పకుండా పూర్తి చేసుకోవడం మంచిది.