పౌరసత్వ సవరణ చట్టాన్ని వ్యతిరేకిస్తూ దేశవ్యాప్తంగా ఆందోళనలు ఉద్ధృతం అవుతున్నాయి. ఢిల్లీ, యూపీ, మహారాష్ట్ర, గుజరాత్, కర్నాటక, బెంగాల్, అసోం, బీహార్, మేఘాలయ, త్రిపుర, ఛండీగఢ్, జమ్మూ, రాజస్థాన్, మధ్యప్రదేశ్ , కేరళ, తమిళనాడు ఇలా అన్ని రాష్ట్రాల్లోనూ నిరసనలు వెల్లువెత్తాయి. దేశరాజధాని ఢిల్లీ మరోసారి నిరసనలతో అట్టుడికింది. భీమ్ ఆర్మీ ఇచ్చిన పిలుపు తీవ్ర ఉద్రిక్తతలకు దారి తీసింది. శుక్రవారం ప్రార్ధనల తర్వాత.. పెద్ద ఎత్తున జామా మసీదుకు చేరుకున్న నిరసనకారులు నినాదాలతో హోరెత్తించారు. జామా మసీదు నుంచి జంతర్ మంతర్ వరకూ చేపట్టిన భారీ ప్రదర్శనను పోలీసులు అడ్డుకున్నారు. భీమ్ ఆర్మీ చీఫ్ చంద్రశేఖర్ ఆజాద్ ను అదుపులోకి తీసుకున్నారు.
ఢిల్లీ మహిళా కాంగ్రెస్ కార్యకర్తలు.. కేంద్ర హోం మంత్రి అమిత్‌షా ఇంటి ముట్టడికి ప్రయత్నించారు. ఢిల్లీ మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు షర్మిలా ముఖర్జీ ఆధ్వర్యంలో కార్తకర్తలు పెద్ద ఎత్తున అమిత్‌షా ఇంటి వద్దకు వచ్చారు. పోలీసులు బారికేడ్లు ఏర్పాటు చేసి ఆందోళనకారుల్ని అడ్డుకున్నారు. అయినా వెనక్కి తగ్గకపోవడంతో నిరసనకారులను అరెస్ట్ చేసి అక్కడి నుంచి తరలించారు.
ఈశాన్య ఢిల్లీలోని 12 పోలీసు స్టేషన్ల పరిధిలో నిషేధ ఉత్తర్వులు అమల్లో ఉన్నాయి. మూడు రోజుల క్రితం చేపట్టిన నిరసన ప్రదర్శనలు హింసకు దారితీశాయి. ముందు జాగ్రత్త చర్యగా పోలీసు బలగాలు ఫ్లాగ్ మార్చ్ నిర్వహించడంతో పాటు.. పలు ప్రాంతాల్లో నిఘా కోసం డ్రోన్‌లను రంగంలోకి దింపారు.
ఉత్తరప్రదేశ్ రణరంగమైంది. బులంద్‌షహర్, ముజఫర్ నగర్, గోరఖ్‌పూర్‌లో నిరసనలు హింసాత్మకంగా మారాయి. ఆందోళనకారులు పోలీసులపై రాళ్లు రువ్వారు. ఈ దాడిలో పలువురు పోలీసులు గాయపడ్డారు. పరిస్థితి చేయిదాటిపోవడంతో పోలీసులు గాల్లోకి కాల్పులు జరిపారు. టియర్ గ్యాస్ ప్రయోగించారు. అయినా ఆందోళనకారులు వెనక్కి తగ్గలేదు. దీంతో లాఠీఛార్జ్ చేసి నిరసనకారులను చెదరగొట్టారు.
బులంద్‌షహర్‌లో ఆందోళనకారులు పోలీసు వాహనాలను తగులబెట్టారు. పెద్దఎత్తున వీధుల్లోకి వచ్చి విధ్వంసం సృష్టించారు. ఆందోళనలతో యూపీలో ఇప్పటివరకు ఏడుగురు మృతి చెందారు.
పౌరసత్వ సవరణ చట్టానికి వ్యతిరేకంగా హైదరాబాద్‌లోనూ నిరనసలు ఊపందుకుంటున్నాయి. శుక్రవారం ప్రార్థనల అనంతరం.. ముస్లింలు పెద్ద సంఖ్యలో చార్మినార్ దగ్గర నిరసన చేపట్టారు. కేంద్రానికి వ్యతిరేకంగా పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. మైనార్టీలకు వ్యతిరేకంగా ఉన్న చట్టాన్ని వెంటనే ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు.
CAA అల్లర్లతో మహారాష్ట్ర, అసోం, గుజరాత్ కూడా అట్టుడికిపోతున్నాయి. నిరసనకారులు ఎక్కడికక్కడ రోడ్లపైకి వస్తున్నారు. ముంబైలోని.. ఓ మసీద్ వద్దకు ఆందోళనకారులు పెద్దఎత్తున చేరుకోవడం ఉద్రిక్తతలకు దారితీసింది. అటు అసోంలోనూ పరిస్థితులు ఇంకా కుదటపడలేదు. అడ్వకేట్ల సంఘం ఆధ్వర్యంలో రాజ్‌భవన్ ముట్టడికి ప్రయత్నించారు. పోలీసులు వీరిని అడ్డుకొని అరెస్ట్ చేశారు.