BHARAT TAXI: దూసుకొస్తోన్న "భారత్ ట్యాక్సీ"
ప్రైవేట్ ట్యాక్సీలకు ధీటుగా భారత్ ట్యాక్సీ.. జనవరి 1 నుంచి సేవలు ప్రారంభం
కేంద్ర ప్రభుత్వం నుంచి ప్రయాణికులకు, ముఖ్యంగా క్యాబ్ డ్రైవర్లకు గుడ్ న్యూస్ చెప్పింది. ఓలా, ఉబర్, ర్యాపిడో వంటి ప్రైవేట్ క్యాబ్ యాప్‌లకు ధీటుగా 'భారత్ ట్యాక్సీ' అనే సరికొత్త యాప్‌ను కేంద్రం తీసుకొస్తోంది. ఈ యాప్... జీరో కమిషన్ మోడల్‌పై పనిచేస్తుంది, అంటే డ్రైవర్లకు ప్రయాణికులు చెల్లించిన మొత్తం.. ఫుల్ ఆదాయంగా వస్తుంది. అందులోంచీ డ్రైవర్లు ఎవరికీ కమిషన్ చెల్లించాల్సిన అవసరం లేదు. ప్రస్తుతం ప్రైవేట్ యాప్‌ల్లో 20-30 శాతం కమిషన్ కట్ అవుతుంది కానీ, భారత్ ట్యాక్సీ యాప్‌లో అలాంటిది లేదు. కేవలం నామమాత్రపు మెంబర్షిప్ ఫీజు మాత్రమే ఉంటుంది. సహకార ట్యాక్సీ కోఆపరేటివ్ లిమిటెడ్ పర్యవేక్షణలో ఈ యాప్ నడుస్తుంది. అమూల్ (GCMMF), ఇఫ్కో, క్రిబ్కో, నాఫెడ్, ఎన్డీడీబీ వంటి ప్రముఖ సహకార సంస్థలు ఈ కోఆపరేటివ్ సంస్థలో భాగస్వాములు. డ్రైవర్లు కూడా షేర్‌హోల్డర్లుగా మారి, నిర్ణయాల్లో పాల్గొంటారు. ఇది ప్రపంచంలోనే మొట్టమొదటి డ్రైవర్ ఓన్డ్ నేషనల్ మొబిలిటీ ప్లాట్‌ఫాం. తాజా అప్డేట్ ప్రకారం, ఢిల్లీలో డిసెంబర్ నుంచే భారత్ ట్యాక్సీ యాప్.. సాఫ్ట్ లాంచ్, పైలట్ రన్ జరుగుతోంది. ఇప్పటికే 51 వేలకు పైగా డ్రైవర్లు రిజిస్టర్ చేసుకున్నారు. జనవరి 1, 2026 నుంచి ఢిల్లీలో అధికారికంగా ప్రయాణికులు ఈ యాప్ ద్వారా క్యాబ్‌లు బుక్ చేసుకోవచ్చు. ఢిల్లీ తర్వాత గుజరాత్‌లోని రాజ్‌కోట్, ఇతర నగరాలకు విస్తరిస్తారు. దేశవ్యాప్తంగా విస్తరణ ప్రణాళిక ఉంది. అప్పుడు ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో కూడా అమల్లోకి వస్తుంది. అలాగే తెలుగు రాష్ట్రాల్లోనూ అతి తొందర్లోనే అమల్లోకి రానుంది.
భారత్ ట్యాక్సీ యాప్ ఫీచర్లు చూస్తే, రియల్ టైమ్ ట్రాకింగ్, SOS బటన్, ట్రిప్ షేరింగ్, యూపీఐ/కార్డు పేమెంట్స్, క్యాన్సిలేషన్లపై కఠిన నియమాలు ఉన్నాయి. అంటే డ్రైవర్లు కచ్చితంగా రూల్స్ పాటించాల్సి ఉంటుంది. సర్జ్ ప్రైసింగ్ లేదు, ఫిక్స్డ్ ఫేర్ మాత్రమే ఉంటుంది. కాబట్టి డ్రైవర్లు ఇష్టం వచ్చినట్లు ఛార్జీలు తీసుకునే వీలు ఉండదు. ఈ యాప్.. ప్రయాణికులకు చవక ఛార్జీలు, డ్రైవర్లకు ఎక్కువ ఆదాయం వచ్చేలా చేస్తుంది. ప్రస్తుతం గూగుల్ ప్లే స్టోర్‌లో బీటా వెర్షన్లో ఈ యాప్ అందుబాటులో ఉంది. ట్రయల్, ఫీడ్‌బ్యాక్ కోసం డౌన్లోడ్ చేసుకోవచ్చు. IOS వెర్షన్ త్వరలో విడుదల కానుంది. ఈ యాప్ రాకతో ఓలా, ఉబర్ వంటి కంపెనీలకు గట్టి పోటీ ఏర్పడనుంది. ప్రయాణికులకు అధిక ఛార్జీల నుంచి ఉపశమనం లభిస్తుంది.
ఈ విషయాన్నీ కేంద్ర మంత్రి అమిత్ షా లోక్‌సభలో వెల్లడించారు. " 'సహకార్ సే సమృద్ధి' మిషన్‌లో భాగంగా ఈ యాప్ వస్తోంది. మొత్తంగా ఈ అప్డేట్ డ్రైవర్లకు స్వతంత్రం, ప్రయాణికులకు సౌలభ్యం తెస్తుంది. అందుకే ఈ యాప్ ఎప్పుడు వస్తుందా అని ప్రజలు ఎదురుచూస్తున్నారు. దేశవ్యాప్తంగా ప్రైవేట్ క్యాప్ సర్వీసులు.. ప్రయాణికుల ప్రయాణ ఖర్చులను విపరీతంగా పెంచేస్తున్నాయి. వేరే ప్రత్యామ్నాయం లేకపోవడంతో ప్రజలు ఇబ్బంది పడుతున్నారు. బస్సుల్లో వెళ్దామంటే.. రద్దీగా ఉంటున్నాయి. మెట్రో రైళ్లు కూడా రద్దీగానే ఉంటున్నాయి. అందుకే క్యాబ్‌లను ఆశ్రయిస్తున్నారు. భారత్ ట్యాక్సీ యాప్ వస్తే.. ప్రజలు ఆ యాప్ ద్వారానే క్యాబ్ సర్వీసులు బుక్ చేసుకునే అవకాశం ఉంది." అని పేర్కొన్నారు.