పౌరసత్వ బిల్లు, ఎన్‌ఆర్‌సీకి వ్యతిరేకంగా రాజ్‌ఘాట్ వద్ద కాంగ్రెస్ ధర్నా
పౌరసత్వ సవరణ చట్టాన్ని తమకు అనుకూలంగా మార్చుకుంటోంది కాంగ్రెస్. సీఏఏకు వ్యతిరేకంగా పోరును ఉధృతం చేసింది. దేశవ్యాప్తంగా పౌరసత్వ బిల్లు, ఎన్‌ఆర్‌సీకి వ్యతిరేకంగా నిరసనలు వెల్లువెత్తుతున్న నేపథ్యంలో.. ఇటు కాంగ్రెస్ కూడా ఆందోళనలకు పదును పెట్టింది. ఇవాళ ఢిల్లీలోని రాజ్‌ఘాట్ వద్ద కాంగ్రెస్ ధర్నాకు దిగనుంది.
కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీ, రాహుల్ గాంధీ, ప్రియాంకా గాంధీ, మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్‌తో పాటు పలువురు పార్టీ ముఖ్యనేతలు ధర్నాలో పాల్గొననున్నారు. మధ్యాహ్నం 2 గంటల నుంచి రాత్రి 8 గంటల వరకూ ఈ ధర్నా కొనసాగనుంది. సీఏఏ, ఎన్‌ఆర్‌సీ రాజ్యాంగ వ్యతిరేకమని కాంగ్రెస్ ఆరోపిస్తోంది. సీఏఏపై తమకు అభ్యంతరాలున్నాయని, దేశవ్యాప్తంగా శాంతియుతంగా జరిగే ఎలాంటి ప్రదర్శనలకైనా తమ మద్దతు ఉంటుందని ఇప్పటికే సోనియా గాంధీ ప్రకటించారు.
మరోవైపు కాంగ్రెస్ తీరుపై బీజేపీ తీవ్రంగా మండిపడుతోంది. కాంగ్రెస్ నేతలు పాకిస్తాన్ నాయకుల్లా మాట్లాడుతున్నారని ఆరోపిస్తున్నారు. ముందు పౌరసత్వ సవరణ బిల్లును చదువుకుని మాట్లాడాలని సూచిస్తున్నారు. కాంగ్రెస్ నేతలు, ఇతర విపక్షాలు రెచ్చగొట్టడం వల్లే ఆందోళనకారులు హింసకు పాల్పడుతున్నారని బీజేపీ నేతలు ఆరోపిస్తున్నారు.