రణరంగంగా మారిన ఆఫ్గనిస్తాన్.. వందకు పైగా ముష్కరులు హతం

Update: 2019-12-24 11:14 GMT

తలలు నరికేస్తున్నా.. ఊలలు వేస్తూనేవుంది. మూలాలపై దెబ్బతీస్తున్నా.. బుసలు కొడుతూనేవుంది. ఎక్కడికక్కడ మట్టుబెడుతున్నా.. ఉగ్రవాదం మళ్లీ పుంజుకుంటూనేవుంది. ముష్కరులను మట్టుబెట్టేందుకు ఎన్ని చర్యలు తీసుకుంటున్నా.. ఉగ్రవాదులు మళ్లీ బలపడుతూనేవున్నారు. ఉగ్రవాదుల ఏరివేతలో భాగంగా ఆఫ్గాన్ సైన్యం భారీ ఆపరేషన్ చేపట్టింది. 24 గంటల్లో వందమంది ఉగ్రవాదులను మట్టుబెట్టింది. అయితే, సైన్యం ఆపరేషన్లకు దీటుగా.. ముష్కర మూకలు రెచ్చిపోతూనేవున్నాయి. సైనిక శిబిరాలపై దాడులకు పాల్పడుతున్నాయి.

అనుక్షణం బాంబుపేలుళ్లు, కాల్పుల మోతతో అట్టుడికిపోయే ఆఫ్గానిస్తాన్ లో ముష్కరవేట సాగుతోంది. ఆఫ్గాన్ సైన్యం ఉగ్రవాదుల ఏరివేతలో బిజీబిజీగా వుంది. బీకర ఆపరేషన్లతో ముష్కరుల ఆటకట్టిస్తోంది. కలుగుల్లో దాగివున్న కర్కష మూకలను బయటికి రప్పించి మరీ మట్టుబెడుతోంది. కేవలం 24 గంటల్లో ఏకంగా వందమంది టెర్రరిస్టులను ఆఫ్గాన్ సైనికులు హతమార్చారు. ఈ విషయాన్ని తాజాగా ఆఫ్గాన్ సైన్యం అధికారిక ప్రకటన విడుదల చేసింది.

24 గంటల్లో ఆఫ్గాన్‌ వ్యాప్తంగా 15 ప్రావిన్స్‌లలో 18 ఆపరేషన్లు చేపట్టినట్లు ఆ దేశ రక్షణ శాఖ ట్విటర్‌లో స్పష్టం చేసింది. ఈ ఆపరేషన్లలో 109 మంది ఉగ్రవాదులను ఆఫ్గాన్‌ బలగాలు మట్టుబెట్టగా.. మరో 45 మంది ముష్కరులు గాయపడినట్లు అధికారులు తెలిపారు. ఇక మరో ఐదుగురిని భద్రతాదళాలు అరెస్టు చేసినట్లు సమాచారం.

కపిసా ప్రావిన్స్‌లోని నిజ్రాబ్‌ జిల్లాలో ఆఫ్గాన్‌ ఆర్మీ జరిపిన వాయుదాడుల్లో 9 మంది తాలిబన్లు హతమైనట్లు రక్షణశాఖ తెలిపింది. ఇక్కడి నాలుగు ప్రధాన ఉగ్ర శిబిరాలను కూడా భద్రతాబలగాలు ధ్వంసం చేశాయి. ఇక లఘ్‌మన్‌లోని అలి షెయింగ్‌ జిల్లాలో జరిపిన వైమానిక దాడుల్లో ముగ్గురు ఉగ్రవాదులను మట్టుబెట్టింది. లోగర్‌లోని మహ్మద్‌ అఘా జిల్లాలో జరిపిన దాడుల్లో 12 మంది ముష్కరులు హతమయ్యారు. వారి ఆయుధ గోదాంను కూడా ధ్వంసం చేసినట్లు రక్షణ శాఖ వెల్లడించింది. అయితే, వీరంతా ఒకే గ్రూపునకు చెందినవారా లేక వేర్వరు గ్రూపులకు చెందినవారా అన్నదానిపై ఆఫ్గాన్ మిలిటరీ స్పష్టత ఇవ్వలేదు.

ఇదిలావుంటే, మిలిటరీ దాడులతో ఆగ్రహంతో రగిలిపోతున్న ఉగ్రమూకలు.. అఫ్గాన్ సైన్యంపై ప్రతి దాడులకు పాల్పడుతున్నాయి. తాజాగా బాల్క్ లోని ఉత్తర ప్రావిన్స్ లో ఉగ్రవాదులు దాడులకు తెగబడ్డారు. ఈ దాడుల్లో ఏడుగురు సైనికులు బలైనట్టు ఆఫ్గాన్ రక్షణ శాఖ స్పష్టం చేసింది. ఇదిలావుంటే, ఈ దాడులకు తమదే బాధ్యత అని తాలిబాన్లు ప్రకటించారు.

మరోవైపు, అఫ్గాన్ తో పాటు.. అక్కడ సేవలందిస్తున్న అమెరికా సైనికుల పైనా దాడులకు తెగిస్తున్నాయి ముష్కర మూకలు. మొత్తానికి పరస్పర దాడులతో ఆఫ్గాన్ మరోసారి రణరంగంగా మారింది.

Similar News