హైదరాబాదీలకు గుడ్‌న్యూస్ చెప్పింది మెట్రో రైల్ కార్పోరేషన్. ప్రస్తుతం టికెట్లు, స్మార్ట్ కార్డుల ద్వారా ప్రయాణిస్తున్నవారు.. ఇకపై క్యూలైన్‌లో నిలబడే అవసరం లేకుండా... ఈ టికెట్ విధానాన్ని తీసుకొచ్చింది.మొబైల్ యాప్ ద్వారా క్యూఆర్ కోడ్‌తోనే టిక్కెట్ పొందే అవకాశం కల్పించింది. ఈ కొత్త విధానం ఇవాల్టి నుంచి అమల్లోకి రానుంది. దీని వల్ల మెట్రో రైలు ప్రయాణీకులకు టికెటింగ్ విధానం మరింత సులభతరమవుతుందన్నారు హైదరాబాద్ మెట్రో ఎండీ ఎన్‌వీఎస్‌రెడ్డి.
ప్రస్తుతం మెట్రోలో ప్రయాణించేవారిలో 60 శాతం మంది స్మార్ట్ కార్డు వాడుతున్నారు. మిగిలినవారు బుకింగ్ కౌంటర్లలో టోకెన్‌లు కొని ప్రయాణిస్తున్నారు. దీంతో రద్దీవేళల్లో కౌంటర్లు ముందు క్యూ ఉంటున్నాయి. ఇప్పుడు క్యూఆర్ కోడ్ టికెట్ విధానం రావడంతో.. ఇకపై అలాంటి ఇబ్బందువులు ఉండవు.
మెట్రో స్టేషన్‌కు రాకుండానే ముందుగానే మెట్రో రైలు రాకపోకలకు సంబంధించిన టికెట్లు బుక్ చేసుకోవచ్చు. అయితే మెట్రో వ్యాలెట్‌లో సరిపడా డబ్బులు ఉండాలి. ఎల్‌అండ్ టీ హైదరాబాద్ ఈ యాప్‌ను తయారు చేసింది. ఇందులో కెళ్లి.. ఎక్కాల్సిన స్టేషన్, దిగాల్సిన స్టేషన్ పేర్లు నమోదు చేస్తే టికెట్ ఛార్జీ కనబడుతుంది. ప్రోసీడ్ టూ పే అనే ఆప్షన్ తో పేమెంట్ పూర్తి చేస్తే ఫోన్‌కు ఎస్సెమ్మెస్‌తో పాటు క్యూఆర్ కోడ్ వస్తుంది. ఈ క్యూఆర్ కోడ్‌ను స్కాన్ చేసి మెట్రో రైల్లో ప్రయాణించవచ్చు.