వచ్చెనెల 2020 జనవరి1 నుంచి మ్యాగ్‌స్ట్రైప్‌తో ఉన్న డెబిట్ కార్డులను బ్లాక్ చేయనున్నట్టు దేశీయ దిగ్గజ సంస్థ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ప్రకటించింది. మ్యాగ్‌స్ట్రైప్ డెబిట్ కార్డుల స్థానంలో కొత్త ఈఎంవీ చిప్ అండ్ పిన్ బేస్డ్ డెబిట్ కార్డులను జారీ చేయనున్నట్టు తెలిపింది. మ్యాగ్‌స్ట్రైప్ కార్డులు కలిగి ఉన్న కస్టమర్లు సమీపంలోని తమ హోం బ్రాంచీలకు వెళ్ళి తమ వివరాలు అందించి కొత్త కార్డులకు దరఖాస్తు చేసుకోవాలని ఎస్‌బీఐ వెల్లడించింది. ఈ నెల డిసెంబర్ 31లోపు ఎలాంటి రుసుము లేకుండా మ్యాగ్‌స్ట్రైప్‌కార్డులను మార్చుకునే వెసులుబాటు కల్పించినట్టు ట్విటర్ ద్వారా ఎస్బీఐ తమ ఖాతాదారులకు సమాచారం అందించింది.
చిప్ ఆధారిత కార్డులను 2016 నుంచి ఆర్‌బీఐ తప్పనిసరి చేసింది. 2016 జనవరి 31 తర్వాత కొత్తగా అకౌంట్ ఓపెన్ చేసుకున్నకొత్త కస్టమర్లకు క్రెడిట్ లేదా డెబిట్ కార్డులను జారీ చేస్తున్నారు. అయితే, అంతకుముందు నుంచి ఉన్న కార్డులను కూడా తప్పనిసరిగా మార్చాలని ఆర్‌బీఐ మార్గదర్శకాలు జారీ చేయడంతో ఎస్‌బీఐ ఆ దిశగా కసరత్తు ప్రారంభించింది. ఇందులో భాగంగా మ్యాగ్‌స్ట్రైప్ డెబిట్ కార్డులు ఉన్న కస్టమర్లు... వాటి స్థానంలో ఈఎంవీ చిప్ డెబిట్ కార్డులు తప్పనిసరిగా తీసుకోవాలి. ఈ సేవలను ఆయా బ్యాంకులు ఉచితంగా అందించాలని, ఈ నెలాఖరులోగా ప్రతి ఒక్కరూ చిప్ ఆధారిత కార్డులు తీసుకోవాలని రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా స్పష్టం చేసింది.