ఆర్మీ చీఫ్ జనరల్ బిపిన్ రావత్ సంచలన వ్యాఖ్యలు

Update: 2019-12-26 12:50 GMT

ఆర్మీ చీఫ్ జనరల్ బిపిన్ రావత్ సంచలన వ్యాఖ్యలు చేశారు. హింసాత్మక ఆందోళనలకు నాయకత్వం వహించేవాళ్లు నాయకులే కాదు అని ఆర్మీ చీఫ్ పేర్కొన్నారు. నాయకులంటే ముందుండి నడిపించే వాళ్లని ఆర్మీ చీఫ్ అభిప్రాయపడ్డారు. నాయకత్వం వహించడం అంత సులువు కాదని, ప్రజలను సరైన మార్గంలో తీసుకెళ్లడం ఆషామాషీ వ్యవహారం కాదన్నారు. అసమగ్రమైన పద్ధతుల్లో ప్రజలను నడిపించేవాళ్లు నాయకులు కారని స్పష్టం చేశారు.

పౌరసత్వ సవరణ చట్టానికి వ్యతిరేకంగా నిరసనలు జరుగుతున్నాయి. ఆందోళన సమయంలో చాలా చోట్ల హింస చెలరేగింది. విధ్వంసకాండ యధేచ్చగా కొనసాగింది. బస్సులు, బైక్‌లు, రైళ్లు, రైల్వే స్టేషన్లను తగులబెట్టారు. దుకాణాలను లూటీ చేశారు. పోలీసులపైనా దాడులకు పాల్పడ్డారు. ఈ హింసపై విమర్శలు వెల్లువెత్తాయి. ఆందోళనలు శాంతియుతంగా ఉండాలే తప్ప హింసకు చోటివ్వరాదనే వాదనలు బలంగా వినిపించాయి. ఐతే, ఆరోపణలు-ప్రత్యారోపణలు, విమర్శలు-ప్రతి విమర్శలు, వాద వివాదాలు అన్నీ కూడా రాజకీయ నాయకులు, సెలబ్రెటీలు, ప్రజా, పౌర సంఘాల నుంచే వచ్చాయి. సైన్యం నుంచి మాత్రం ఎలాంటి స్పందన రాలేదు. ఇన్ని రోజులకు, ఆర్మీ స్పందించింది. స్వయంగా సైన్యాధ్యక్షుడు జనరల్ బిపిన్ రావత్ రియాక్టయ్యారు. యూనివర్సిటీలలో ఆందోళనల తీరుపై ఆర్మీ చీఫ్ ఆవేదన వ్యక్తం చేశారు.

ఆర్మీ చీఫ్ వ్యాఖ్యలు రాజకీయ రగడకు దారి తీశాయి. ఎంఐఎం చీఫ్ అసదుద్దీన్ ఒవైసీ ఘాటుగా స్పందించారు. ఎవరి పరిమితులు ఎంతవరకో నాయకత్వానికి కూడా తెలుసన్నారు.

కాంగ్రెస్ నేత దిగ్విజయ్ సింగ్ కూడా ఆర్మీ చీఫ్‌పై ఎదురు దాడి చేశారు. మతకల్లోలాలు, మారణహోమాలకు తమ అనుచరులను రెచ్చగొట్టేవాళ్లు కూడా నాయకులు కాదని దిగ్విజయ్ పేర్కొన్నారు. బీజేపీ, RSSలను దృష్టిలో పెట్టుకొని దిగ్విజయ్ ఈ వ్యాఖ్యలు చేశారు. ఐతే, దిగ్విజయ్ వ్యాఖ్యలు ఆయనకు, ఆయన పార్టీకే బూమ్‌రాంగ్ అయ్యారు. సిక్కు వ్యతిరేక అల్లర్లను ప్రస్తావిస్తూ నెటిజన్లు డిగ్గీ రాజాపై సెటైర్లు వేస్తున్నారు.

Similar News