ఉత్తరాది రాష్ట్రాలను వణికిస్తున్న చలిపులి

Update: 2019-12-28 01:59 GMT

రక్తం గడ్డకట్టే చలితో ఉత్తరాది రాష్ట్రాలు వణికిపోతున్నాయి. రోజురోజుకి చలితీవ్రత పెరిగిపోతుండటంతో జనం అల్లాడిపోతున్నారు. కనిష్ట ఉష్ణోగ్రతలు రోజు రోజుకీ పడిపోతుండటంతో చాలా ప్రాంతాల్లో మంచు దుప్పటి కప్పుకుంది. రాజస్థాన్‌లోని ఫతేపూర్‌లోని ఉష్ణోగ్రతలు మైనస్ 3 డిగ్రీల దిగువన నమోదవుతున్నాయి. ఉత్తరప్రదేశ్, హర్యానా, చండీగఢ్, ఢిల్లీ, పంజాబ్‌లో పొగమంచు దట్టంగా కమ్ముకుంది. అలాగే, బీహార్, ఉత్తరాఖండ్, రాజస్థాన్, పశ్చిమబెంగాల్, సిక్కిం ప్రాంతాల్లో చలి తీవ్రత ఇంకా ఎక్కువ ఉందని వాతావరణ శాఖ తెలిపింది. డిసెంబరు 29 వరకు శీతల గాలులు, పొంగమంచు ఢిల్లీ, పంజాబ్, హర్యానాల్లో ఆరెంజ్ అలెర్ట్ ప్రకటించారు.

హిమాచల్ ప్రదేశ్, ఉత్తరాఖండ్ లో పలు ప్రాంతాలు మంచుతో నిండిపోయాయి. గతంలో కంటే కనిష్ట ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. హిమపాతానికి ఉత్తరాఖండ్ లోని బద్రీనాథ్ ఆలయం సగం వరకు మంచుతో నిండిపోయింది. ఆలయ పరిసరాల్లో మంచు పెద్ద ఎత్తున పేరుకుపోయింది.

మరోవైపు హిమాచల్ ప్రదేశ్ లో సైతం ఉష్ణోగ్రతలు భారీగా పడిపోయాయి. కుఫ్రీ, మనాలి, సోలాన్ , భుంటర్ , సుందర్ నగర్ , కల్పా తదితర ప్రాంతాల్లో శుక్రవారం సున్నా డిగ్రీల సెల్సియస్ కంటే కనిష్ఠ ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. కీలాంగ్లో రికార్డు స్థాయిలో మైనస్ 15 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రత నమోదైంది. ఉత్తరాదిలో మరో రెండు మూడు రోజులు ఇలాంటి వాతావరణమే కొనసాగుతుందని ఐఎండీ వెల్లడించింది. అంతేకాదు, ఉపరితల ద్రోణి ప్రభావంతో డిసెంబరు 31 నుంచి జనవరి 3 వరకు వర్షాలు కురుస్తాయని తెలిపింది.

Similar News