తెలంగాణలో నెక్స్ట్ బాస్ ఎవరు?

Update: 2019-12-30 12:14 GMT

తెలంగాణలో కొత్త ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎవరు? ప్రస్తుత CS జోషి మంగళవారం రిటైర్ అవుతున్నారు. ఈ నేపథ్యంలో కొత్త సీఎస్ ఎవరనే ఉత్కంఠ నెలకొంది. సీనియార్టీ జాబితాలో అజయ్ మిశ్రా, బినయ్ కుమార్, బిపి ఆచార్య, పుష్ప సుబ్రమణ్యం, సురేష్ చందా, సోమేష్ కుమార్, చిత్ర రామచంద్రన్‌, హీరాలాల్‌ సమారియా ఉన్నారు. వారిలో ఎవరిని CS పదవి వరిస్తుందన్నది సచివాలయ వర్గాల్లో హాట్‌ టాపిక్‌గా మారింది.

తెలంగాణ లాంటి రాష్ట్రంలో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కావాలని ప్రతి IAS అధికారి అనుకుంటారు. 2014లో ప్రత్యేక రాష్ట్ర ఏర్పాటు తర్వాత తొలి CSగా రాజీవ్ శర్మను సీఎం కేసీఆర్ నియమించారు. ఆ తర్వాత ప్రదీప్ చంద్ర, ఎస్పీ సింగ్, SK జోషికి అవకాశం దక్కింది. మంగళవారం రిటైర్‌ కాబోతున్న SKజోషి.. 2018 జనవరి 31న CSగా బాధ్యతలు తీసుకున్నారు. మరోవైపు.. పదవీకాలం పూర్తయ్యాక రాజీవ్ శర్మను ప్రభుత్వ ముఖ్య సలహాదారుగా సీఎం నియమించారు.

రాష్ట్ర ప్రభుత్వం 14 మంది పేర్లను పరిశీలిస్తోంది. అందులో ముగ్గురు సీనియర్ అధికారులు.. వివిధ శాఖల్లో పనిచేసిన అనుభవంతో పాటు రాష్ట్రంలో కొత్త పథకాలు తీసుకురావడంలో కీలక పాత్ర పోషించారని చెప్తున్నారు. అజయ్ మిశ్రా, బినయ్ కుమార్, బిపి అచార్య, పుష్ప సుబ్రమణ్యం, సురేష్ చందా, చిత్ర రామచంద్రన్, హీరాలాల్ సమరియాతో పాటు.. రాజేశ్వర్ తివారి, సోమేశ్ కుమార్, సునీల్ శర్మ రేసులో ఉన్నట్టు చెప్తున్నారు. అజయ్ మిశ్రా 84 బ్యాచ్‌కు చెందిన అధికారి. ఈయన 2020 జులైలో పదవి విరమణ చేస్తారు. సోమేశ్ కుమార్ 89 బ్యాచ్ అధికారి. 2023 డిసెంబర్ వరకు సర్వీస్ ఉంది. వీరిలో ఒకరిని CSగా నియమించే అవకాశం ఉందని సచివాలయ వర్గాలు అంటున్నాయి. వీరితోపాటు 85 బ్యాచ్‌కు చెందిన చిత్ర రామచంద్రన్, 88 బ్యాచ్‌ అధికారి ఆధర్ సిన్హా పేర్లను కూడా ప్రభుత్వం పరిశీలిస్తోంది.

అయితే ఆరునెలలు మాత్రమే సర్వీసు ఉండటంతో ముందుగా అజయ్ మిశ్రాను CSగా నియమించి.. ఆ తర్వాత సోమేశ్‌కుమార్‌కు అవకాశం ఇస్తారని సచివాలయ వర్గాల్లో చర్చ జరుగుతోంది. మంగళవారం సాయంత్రానికి కొత్త CS ఎవరనేది తేలనుంది.

Similar News