రాష్ట్ర ప్రభుత్వ నిర్ణయాన్ని తప్పుపట్టిన కేరళ గవర్నర్ ఆరిఫ్

Update: 2020-01-02 09:01 GMT

కేరళ గవర్నర్ ఆరిఫ్ మహ్మద్ ఖాన్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఏకంగా తన రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్నే తప్పుబట్టారు. ఇటీవల పౌరసత్వ సవరణ చట్టానికి వ్యతిరేకంగా కేరళ అసెంబ్లీ తీర్మానాన్ని ఆమోదించింది. అయితే, దీనిని ఆరిఫ్ తప్పుబట్టారు. సీఏఏకు వ్యతిరేకంగా ఆమోదించిన బిల్లుకు చట్టపరమైన విలువ లేదన్నారు. రాజ్యాంగ పరంగా చూసిన ఆ తీర్మానం చెల్లదన్నారు.

పౌరసత్వ సవరణ చట్టానికి వ్యతిరేకంగా దేశవ్యాప్తంగా ఆందోళనలు కొనసాగుతున్నాయి. పశ్చిమ బెంగాల్, కేరళ వంటి రాష్ట్రాలతో పాటు కాంగ్రెస్ పాలిత రాష్ట్రాలన్నీ సీఏఏను వ్యతిరేకిస్తున్నాయి. ఈ నేపథ్యంలో కేరళ ప్రభుత్వం ఓ అడుగు ముందుకేసి.. ఇటీవల పౌరసత్వ సవరణ చట్టానికి వ్యతిరేకంగా అసెంబ్లీలో తీర్మానం చేసింది. సీఏఏను దేశంలో అమలు చేయొద్దని తీర్మానించింది. 140 మంది ఎమ్మెల్యేల్లో ఒక్క బీజేపీ ఎమ్మెల్యే మినహా.. మిగతా సభ్యులందరూ తీర్మానానికి ఆమోదం తెలిపారు. అయితే, తీర్మానాన్ని ఆ రాష్ట్ర గవర్నరే వ్యతిరేకించడం సంచలనం సృష్టిస్తోంది.

ఇదిలావుంటే, కేరళ ప్రభుత్వ తీరుపై బీజేపీ నాయకులు మండిపడుతున్నారు. సీఏఏకు వ్యతిరేకంగా తీర్మానం చేసే హక్కు అసలు రాష్ట్రాలకు లేదని ఇప్పటికే పలువురు సీనియర్ బీజేపీ నేతలు తెలిపారు. ఇక, కేరళ అసెంబ్లీ తీర్మానం పై గవర్నర్ వ్యాఖ్యల్ని కమలనాథులు స్వాగతించారు. సీఏఏకు వ్యతిరేకంగా కేరళ అసెంబ్లీ చేసిన తీర్మానం చెల్లదని బీజేపీ అధికార ప్రతినిధి జీవీఎల్ నర్సింహారావు తెలిపారు. సీఏఏకు వ్యతిరేకంగా వ్యవహరిస్తున్న కేరళ సీఎం పినరయి విజయన్ పై చర్యలు తీసుకోవాలని ఆయన డిమాండ్ చేశారు.

Similar News