రణరంగాన్ని తలపిస్తున్న అమరావతి

Update: 2020-01-03 13:14 GMT

అమరావతి పూర్తి రణరంగాన్ని తలపిస్తోంది. రాజధాని రైతుల ఆందోళనలు ఉగ్రరూపం దాల్చాయి. నిన్నటి వరకు ఆందోళనలు, నిరసనలకే పరిమితమైన రైతులు ఇప్పుడు సకల జనుల సమ్మెతో కదం తొక్కారు. రహదారిపై టెంట్‌ వేసి మహాధర్నా చేపట్టారు. మూడు రాజధానులు వద్దు.. అమరావతే ముద్దంటూ నినాదాలు చేశారు. ఇలా రాజధాని ప్రాంతంలో ఎక్కడ చూసినా నిరసన జ్వాలలు ఎగిసిపడ్డాయి. అటు ఆందోళన కారులపై పోలీసులు జులుం ప్రదర్శించారు. మహిళలు అని కూడా చూడకుండా వారిని బలవంతగా అరెస్ట్‌ చేసే ప్రయత్నం చేశారు. కొందరిపై దాడి చేసి మరి వాహనాలు ఎక్కించారు.

మందడం మహాధర్నా తీవ్ర ఉద్రిక్తంగా మారింది. ధర్నాలో పాల్గొన్న వారిని పోలీసులు అరెస్ట్ చేశారు. దీంతో మహిళలు, పోలీసులకు మధ్య తోపులాట జరిగింది. పోలీసు వాహనానికి అడ్డంగా ఆందోళనకారులు పడుకున్నారు. పోలీసు వాహనం టైరు ఓ రైతు చేయిపైకి ఎక్కడంతో గాయాలయ్యాయి. పోలీసుల చర్యపై మందడం వాసులు భగ్గుమన్నారు. మహిళలను పోలీసు వ్యానులోకి ఎక్కించే క్రమంలో తోపులాట జరిగి పలువురికి స్వల్ప గాయాలయ్యాయి. పోలీసులు తమ గొంతు నులిమారని పలువురు ఆరోపించారు. అదే సమయంలో ఓ మహిళ స్పృహతప్పి పడిపోయింది. పోలీసులు, మత గొంతు నులిమారని ఆందోళనకారులు మండిపడ్డారు.

ప్రభుత్వం వెంటనే దిగి రాకుంటే ఆత్మహత్యలకు సైతం వెనుకాడబోమని రాజధాని రైతులు హెచ్చరిస్తున్నారు. ప్రజల మనోభావాలకు విలువ ఇవ్వని ప్రభుత్వం అధికారంలో ఉండడానికి వీల్లేదంటూ గర్జించారు. పరిపాలన చేతకాకపోతే ఇంటిలో కూర్చోవాలని.. ఇలాంటి ప్రభుత్వం ఉండడం కంటే.. రాష్ట్రపతి పాలనే నయమని మహిళలు ఆవేదన వ్యక్తం చేశారు.. ఓట్లు వేసి గెలిపించిన తమను ఇలా రోడ్లు పాలు చేసిన ప్రభుత్వానికి సరైన సమాధానం చెప్పక తప్పదని మహిళలు హెచ్చరిస్తున్నారు.

Similar News