ఆర్మీ చీఫ్ జనరల్ మనోజ్ ముకుంద్ నరవణే సియాచిన్‌లో పర్యటించారు. అత్యంత శీతల పరిస్థితుల్లో విధులు నిర్వహిస్తున్న జవాన్లను కలిశారు. సియాచిన్ పరిసరాల్లో తాజా పరిస్థితుల గురించి అడిగి తెలుసుకున్నారు. జవాన్లకు అందుతున్న సౌకర్యాలపై ఆరా తీశారు. అంతకుముందు, అమరవీరుల స్థూపాన్ని ఆర్మీ చీఫ్ సందర్శించారు. అక్కడ అమరజవాన్లకు ఘనంగా నివాళి అర్పించారు.
ఆర్మీ చీఫ్‌గా జనరల్ నరవణే గతవారమే బాధ్యతలు చేపట్టారు. సైన్యాధ్యక్షునిగా నియమితులైన తర్వాత తొలిసారి సియాచిన్‌కు వెళ్లారు. సియాచిన్ గ్లేసియర్ భద్రతాపరంగా మనదేశానికి చాలా కీలక మైన ప్రాంతం. ఇది ప్రపంచంలోనే అత్యంత ప్రమాదకరమైన ప్రాంతం. ఇక్కడ శత్రువుల కంటే కూడా ప్రకృతితోనే ప్రమాదం ఎక్కువ. ఐనప్పటికీ వందలామంది సైనికులు ఇక్కడ అనునిత్యం కాపలా కాస్తుంటారు. దేశ రక్షణలో భాగస్వామ్యం అవుతూ ఉంటారు. ఈ నేపథ్యంలో రాష్ట్రపతి, ప్రధాని, రక్షణమంత్రి తదితరులు సియాచిన్‌కు వెళ్లి సైనికులను కలుసుకున్నారు. తాజాగా ఆర్మీ చీఫ్ కూడా వెళ్లి జవాన్లతో సమావేశమయ్యారు.