ఆహా! ఎంత మంచి వార్త.. వారానికి 4 రోజులే ఆఫీస్.. రోజుకి 6 గంటలే డ్యూటీ

Update: 2020-01-10 09:23 GMT

ఎంతసేపూ ఆఫీసు, ఉద్యోగం తప్పించి ఇంటి గురించి, పిల్లల గురించి పట్టించుకునే పన్లేదా అని ఇంట్లో వాళ్లు చీవాట్లు పెడుతూనే ఉంటారు. మరి వారానికి 6 రోజులు డ్యూటీ.. రోజుకి 8 గంటలు పని.. ఆఫీస్‌కి వెళ్లి రావడానికి మరో రెండు గంటలు. ఇంట్లో పనుల గురించి పట్టించుకోవడానికి టైమ్ ఎక్కడ ఉంటుంది. అర్జంట్ పన్లైతే లీవ్ పెట్టుకోవాలి. లేదంటే ఓ గంట లేటుగా వస్తాను సర్ అని పర్మిషన్ తీసుకోవాలి. ఇదిగో వీటన్నింటినీ దృష్టిలో పెట్టుకునే ఉద్యోగులకు వారానికి నాలుగు రోజులు పని దినాలు నిర్ణయించాలని ఫిన్లాండ్ ప్రధాని సనా మెరిన్ ప్రతిపాదించారు.

అంతే కాదు ప్రతి రోజు కూడా 8 గంటలు పని చేయక్కర్లేదు 6 గంటలు సిన్సియర్‌గా టైమ్ వేస్ట్ చేయకుండా పని చేస్తే సరిపోతుంది అని అంటున్నారు. సెలవు రోజుల్లో కుటుంబసభ్యులతో గడపడం, వారి అవసరాలు చూడడం, ఇష్టమైన వారికోసం సమయం కేటాయించడం వంటివి చాలా ముఖ్యమని ఆమె తెలిపారు. ప్రస్తుతం అక్కడ ఉద్యోగులు వారానికి ఐదు రోజులు పని చేస్తున్నారు. పనిగంటలు కూడా ఎనిమిది గంటలు ఉన్నాయి.

వాటిని మార్చి ఇప్పుడు కొత్తగా ఈ ప్రతిపాదనను తీసుకు వచ్చారు ప్రధాని. ఆమె ప్రతిపాదనను ఫిన్లాండ్ విద్యాశాఖా మంత్రి లీ అండర్సన్ సమర్ధించారు. మంత్రి మండలి ఆమోదం పొందితే ఇకపై అక్కడి ఉద్యోగులు 4 రోజులే ఆఫీసులకు వెళతారు. స్వీడన్‌లో 2015 నుంచే 6 గంటల పని విధానం అమలు చేస్తున్నారు. తాజాగా ఫిన్లాండ్‌లోనూ అదే ప్రతిపాదన వెలువడడంతో దేశ ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు.

Similar News