ఉమ్మడి మహబూబ్‌ నగర్ జిల్లా.. మహిళలే మహారాణులు

Update: 2020-01-10 01:02 GMT

ఉమ్మడి మహబూబ్‌ నగర్ జిల్లాలోని మున్సిపాల్టీల్లో ఓటర్ల తుది జాబితా చూసిన పార్టీలు.. మహిళలే మహారాణులంటున్నారు. పురపాలికల్లో మహిళా ఓటర్లదే పైచేయిగా ఉంది. అతివలే అభ్యర్థుల భవిష్యత్‌ నిర్ణయించేవారిగా మారిపోయారు.

ఉమ్మడి పాలమూరు జిల్లా మున్సిపాల్టీల్లో మొత్తం 5 లక్షల 23 వేల 428 మంది ఓటర్లున్నారు. ఇందులో పురుషులు 2 లక్షల 60 వేల 705 మంది కాగా.. మహిళా ఓటర్లు 2 లక్షల 62 వేల 707 మంది ఉన్నారు. ఇక్కడున్న 17 మున్సిపాల్టీల్లో 12 ప్రాంతాల్లో మహిళలు ఎటు మొగ్గు చూపితే..అటే విజయావకాశాలున్నాయి. సహజంగా మున్సిపల్‌ ఎన్నికల్లో స్వల్ప ఓట్ల తేడాతో కౌన్సిలర్ అభ్యర్థుల గెలుపోటములు ఉంటాయి. చాలా మంది పది ఓట్ల తేడాతోనూ ఎన్నికైన సందర్భాలు చాలా ఉన్నాయి. 17 మున్సిపాల్టీల్లో కోస్గి, వనపర్తి, పెబ్బేరు, కల్వకుర్తి, కొల్లాపూర్‌ మున్సిపాల్టీల్లో మాత్రమే పురుష ఓటర్లు ఎక్కువగా ఉన్నారు.

మహిళా రిజర్వేషన్ ప్రకారం ఈసారి ఉమ్మడి మహబూబ్‌ నగర్ జిల్లాలో అతివలకు ఈసారి ఎక్కువ పట్టాభిషేకాలు జరగనున్నాయి. ఇక్కడున్న మొత్తం 17 మున్సిపాల్టీల్లో.. పదింటిలో మహిళలే అధికార పీఠం అధిష్టించి.. మహారాణులుగా అవతరించనున్నారు. దీనికి తోడు జిల్లాలో 338 కౌన్సిలర్‌ స్థానాలు ఉండగా.. 167 స్థానాలను మహిళలకే కేటాయించారు. అంటే దాదాపు సగం స్థానాల్లో మహిళలే కౌన్సిలర్లుగా ఎన్నిక కానున్నారు. విజేతలను తేల్చేది.. విజేతలుగా నిలిచేది కూడా మహిళలే కావడం ఆసక్తిగా మారింది.

Similar News