నిర్భయ కేసులో దోషి ముఖేశ్ కుమార్ సింగ్ పెట్టుకున్న క్షమాభిక్ష పిటిషన్ రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ వద్దకు చేరింది. గురువారం రాత్రి ఈ పిటిషన్‌ను రాష్ట్రపతి భవన్‌కు పంపించినట్లు.. కేంద్ర హోంశాఖ వర్గాలు తెలిపాయి. అయితే ఈ క్షమాభిక్ష పిటిషన్‌ను తిరస్కరించాలని హోంశాఖ రాష్ట్రపతికి సిఫార్సు చేసింది.
క్షమాభిక్ష కోసం ముఖేశ్ చేసిన అభ్యర్థనను తిరస్కరించిన ఢిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్‌కు రాష్ట్ర ప్రభుత్వం సిఫార్సు చేసింది. అయితే దాన్ని ఆమోదించడం గమనార్హం. క్షమాభిక్ష పిటిషన్‌ను లెఫ్టినెంట్ గవర్నర్ కేంద్ర హోంశాఖకు పంపారు. దీంతో పాటు తన అభిప్రాయాన్ని కూడా జత చేశారు. తాజాగా హోంశాఖ దాన్ని రాష్ట్రపతి భవన్‌కు పంపింది.
నిర్భయ కేసులో నలుగురు దోషుల ఉరికి ఓ వైపు ఏర్పాట్లు జరుగుతుండగా.. క్షమాభిక్ష రూపంలో బ్రేక్ పడింది. ముఖేశ్ పెట్టుకున్న క్షమాభిక్ష పిటిషన్ పెండింగ్‌లో ఉన్నందున శిక్ష అమలును వాయిదా వేయాలని ఢిల్లీ ప్రభుత్వం హైకోర్టును కోరింది. జైలు నిబంధనల ప్రకారం.. కేసులో ఒకరి కంటే ఎక్కువ మంది దోషులు ఉన్నపుడు.. వారిలో ఒకరు క్షమాభిక్షకు అప్లై చేసుకున్నా.. అది తేలే వరకు మిగిలినవారికి శిక్షను అమలు చేయడం కుదరదు. దీంతో నిర్భయ దోషుల ఉరిశిక్ష తాత్కాలికంగా వాయిదా పడింది.
ఉరి శిక్ష ఆలస్యమవుతుండటంపై.. నిర్భయ తల్లి తీవ్ర విచారం వ్యక్తం చేశారు. ఇప్పటి వరకు తాను రాజకీయాల గురించి మాట్లాడలేదు కానీ.. కొందరు రాజకీయ లబ్ది కోసం నిర్భయ మరణంతో ఆడుకుంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. మరోవైపు క్షమాభిక్ష పిటిషన్ రద్దు కాగానే.. నిర్భయ దోషులకు ఉరిశిక్ష పడనుంది.