Budget 2026 : బడ్జెట్ 2026 గ్రోత్ ఫార్ములా..భారత ఆర్థిక వ్యవస్థను మార్చే ఆ 4 కీలక స్తంభాలివే.
Budget 2026 : త్వరలో ప్రవేశపెట్టబోయే 2026 కేంద్ర బడ్జెట్‌పై పారిశ్రామిక రంగం భారీ ఆశలు పెట్టుకుంది. ప్రపంచవ్యాప్తంగా ఆర్థిక మందగమనం, భౌగోళిక రాజకీయ ఉద్రిక్తతలు ఉన్నప్పటికీ, భారత ఆర్థిక వ్యవస్థ స్థిరంగా కొనసాగుతోంది. ఈ ఊపును ఇలాగే కొనసాగించాలంటే ప్రభుత్వం కేవలం తాత్కాలిక ఉపశమన చర్యలు కాకుండా, దీర్ఘకాలిక ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకుని నాలుగు కీలక రంగాలపై దృష్టి పెట్టాలని నిపుణులు సూచిస్తున్నారు. అవే మౌలిక సదుపాయాలు, తయారీ రంగం, హరిత ఇంధనం మరియు ఎంఎస్ఎంఈలు.
మౌలిక సదుపాయాల కల్పన : గత దశాబ్ద కాలంగా ప్రభుత్వం రోడ్లు, రైల్వేలపై భారీగా నిధులు వెచ్చిస్తోంది. 2018 నుంచి 2026 మధ్య బడ్జెట్ కేటాయింపులు ఏటా సగటున 12% పెరుగుతూ వస్తున్నాయి. దీనివల్ల దేశంలో లాజిస్టిక్స్ ఖర్చులు గణనీయంగా తగ్గి, ప్రస్తుతం 8 శాతానికి చేరాయి. ఈ బడ్జెట్‌లో రైల్వే రవాణాను మరింత చౌకగా మార్చడంతో పాటు, రహదారుల నిర్మాణంలో ప్రైవేట్ భాగస్వామ్యాన్ని (PPP మోడల్) పెంచాలని ఇండియా ఇంక్ కోరుకుంటోంది. మౌలిక సదుపాయాలు బాగుంటేనే విదేశీ పెట్టుబడులు వెల్లువెత్తుతాయని పరిశ్రమ వర్గాల నమ్మకం.
తయారీ రంగం, వ్యాల్యూ ఎడిషన్ : భారత జీడీపీలో తయారీ రంగం వాటాను ప్రస్తుతం ఉన్న 17% నుంచి 25%కి పెంచాలన్నది ప్రభుత్వ లక్ష్యం. దీనికోసం ప్రవేశపెట్టిన PLI (ప్రొడక్షన్ లింక్డ్ ఇన్సెంటివ్) పథకం మంచి ఫలితాలిస్తోంది. అయితే, కేవలం అసెంబ్లీంగ్ కాకుండా, పూర్తిస్థాయి తయారీ భారత్‌లోనే జరగాలి. అందుకే ఈ బడ్జెట్‌లో రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్, స్కిల్ డెవలప్‌మెంట్ ఎలక్ట్రానిక్స్, ఈవీ బ్యాటరీల తయారీపై మరిన్ని పన్ను మినహాయింపులు ఇవ్వాలని కంపెనీలు కోరుతున్నాయి.
హరిత ఇంధన విప్లవం : 2070 నాటికి నెట్-జీరో ఉద్గారాల లక్ష్యాన్ని చేరుకోవాలని భారత్ కంకణం కట్టుకుంది. పరిశ్రమలు స్వచ్ఛ ఇంధనం వైపు మారాలంటే భారీగా నిధులు అవసరం. దీనికోసం బడ్జెట్‌లో గ్రీన్ ప్రాజెక్టులకు సులభంగా రుణాలు అందేలా చూడాలని, సోలార్, విండ్ ఎనర్జీ క్లస్టర్లకు ప్రోత్సాహకాలు ఇవ్వాలని పారిశ్రామికవేత్తలు ఆశిస్తున్నారు. పర్యావరణ హితమైన వ్యాపారాలకు ప్రాధాన్యత ఇవ్వడం వల్ల అంతర్జాతీయ మార్కెట్లో మేడ్ ఇన్ ఇండియా ఉత్పత్తుల డిమాండ్ పెరుగుతుంది.
MSMEలకు ఊతం : భారత జీడీపీలో 30%, ఎగుమతుల్లో 45% వాటా కలిగి ఉన్న ఎంఎస్ఎంఈలు ప్రస్తుతం రుణాల లభ్యత, చెల్లింపుల జాప్యం వంటి సమస్యలతో సతమతమవుతున్నాయి. ఈ బడ్జెట్‌లో ముద్రా రుణాల పరిమితిని పెంచాలని, వీటికి తక్కువ వడ్డీకే రుణాలు అందించేలా చర్యలు తీసుకోవాలని డిమాండ్ వినిపిస్తోంది. అలాగే ఈ చిన్న పరిశ్రమల కోసం ప్రత్యేకంగా రెడీ-టు-యూజ్ ఇండస్ట్రియల్ పార్కులను అభివృద్ధి చేస్తే, అవి అంతర్జాతీయ స్థాయి కంపెనీలతో పోటీ పడగలవు.