సర్వోన్నత న్యాయస్థానం సంచలన నిర్ణయం

Update: 2020-02-10 17:38 GMT

సర్వోన్నత న్యాయస్థానం సంచలన నిర్ణయం వెలువరించింది. మత విశ్వాసాలపై పూర్తి స్థాయిలో విచారణ జరపడానికి సుప్రీంకోర్టు అంగీకరించింది. ఇందుకోసం ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ బోబ్డే నేతృత్వంలో 9 మంది సభ్యు లతో రాజ్యాంగ ధర్మాసనం ఏర్పాటైంది. ఏయే అంశాలపై విచారణ జరుపుతామో కూడా కోర్టు వెల్లడించింది. మత విశ్వాసాలకు సంబంధించి 7 అంశాలపై రాజ్యాంగ ధర్మాసనం విచారణ జరపనుంది. ఆర్టికల్-25 ప్రకారం లభించే ప్రార్ధించే హక్కు, మతాలు, అందులోని తెగలు, వర్గాల్లోని ప్రార్ధనా విధానాలపై ధర్మాసనం దృష్టి సారించనుంది. మతస్వేచ్చ, మత విశ్వాసం, మత విశ్వాసాల విస్తృతి, పరిధులు, నైతికతపై చర్చించనుంది. మత విశ్వాసాల్లో రకాలు, మార్పులు-చేర్పులపై వాదనలు నమోదు చేయనుంది. వీటితో పాటు రాజ్యాంగంలో పేర్కొన్న హిందువు అన్న పదానికి సుప్రీం ధర్మాసనం వివరణ ఇవ్వనుంది. అలాగే, మత విషయాల్లో కోర్టుల న్యాయ సమీక్షాధికారం, కోర్టుల పరిధిపైనా సర్వోన్నత న్యాయస్థానం విచారణ జరపనుంది. ఈ 7 అంశాలపై వాదనల నమోదుకు 5 రోజులు కేటాయించారు. అవసరమైతే మరో 2 రోజులు పొడిగిస్తామని సుప్రీంకోర్టు తెలిపింది.

శబరిమల వివాదం నేపథ్యంలో అత్యున్నత న్యాయస్థానం ఈ నిర్ణయం తీసుకుంది. శబరిమలలోకి అన్ని వయసుల మహిళలను అనుమతిస్తూ 2018లో సుప్రీంకోర్టు సంచలన తీర్పు వెలువరించింది. ఐతే, బెంచ్‌లోని మహిళా న్యాయ మూర్తి మాత్రం మతపరమైన విశ్వాసాల్లో కోర్టుల జోక్యం తగదని పేర్కొన్నారు. మొత్తమ్మీద సుప్రీంకోర్టు తీర్పుపై మిశ్ర మ స్పందన వ్యక్తమైంది. తీర్పును పున: సమీక్షించాలని డిమాండ్లు వచ్చాయి. శబరిమల కేసుతో పాటు మసీదుల్లో కి మహిళ ప్రవేశంపైనా విచారణ జరపాలని పిటిషన్లు దాఖ లయ్యాయి. మొత్తమ్మీద 70 పిటిషన్లు దాఖలయ్యాయి. వాటిపై నాటి ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ రంజన్ గొగోయ్ నేతృత్వంలో బెంచ్ దృష్టి సారించింది. మత పరమైన విశ్వాసాల్లో కోర్టుల జోక్యం, న్యాయ సమీక్ష పరిధి సహా కీలకాంశాలపై రాజ్యాంగ ధర్మాసనమే విచారించాలంటూ కేసును అప్పగించారు. ఈ నేపథ్యంలో సీజేఐ జస్టిస్ బోబ్డే నేతృత్వంలోని బెంచ్ విచారణ జరిపింది. మతపరమైన అంశాలపై విచారణ జరపడానికి 9 మంది సభ్యులతో రాజ్యాంగ ధర్మాసనానికి అప్పగించింది. శబరిమల సహా ఇతర అంశాలపై ఎలా వాదించాలో న్యాయవాదులంతా చర్చించుకొని ఓ నిర్ణయానికి రావాలని సూచించింది.

 

Similar News