దశాబ్దాలుగా కొనసాగిన కోర్టు కేసులు, ఎన్నో ఎళ్ల ఎదురుచూపుల తర్వాత ఆయోధ్యలో రామ మందిర నిర్మాణంలో కీలక ఘట్టం ఇవాళ చోటు చేసుకోబోతోంది. ఆలయ నిర్మాణం కోసం కేంద్రం ఏర్పాటు చేసిన శ్రీరామ జన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్ట్ ఢిల్లీలో సమావేశం కాబోతోంది. రామ మందిర నిర్మాణంపై చర్చించేందుకు ట్రస్ట్ భేటీ కావటం తొలిసారి. ఈ తొలి సమావేశంలో మందిర నిర్మాణ కార్యచరణను రూపొందించనున్నారు. మందిరం ప్రారంభానికి ముహూర్తం తేదిని నిర్ణయించటంతో పాటు ప్రజల నుంచి విరాళాల సేకరణకు సంబంధించి కమిటీ చర్చించనుంది. విరాళాల సేకరణ, ఖర్చు విషయంలో ప్రజల నుంచి విమర్శలు తలెత్తకుండా అంతా పారదర్శకంగా ఉండేలా ఎలాంటి పద్దతులు అవలంభించాలనేది ట్రస్ట్ సభ్యులు అభిప్రాయాలు వ్యక్తం చేయనున్నారు. అలాగే మందిర నిర్మాణం ఎంత సమయంలో పూర్తి చేయాలనేది కూడా సమావేశంలో చర్చించనుంది. పనుల్లో జాప్యం జరక్కుండా నిర్ణీత సమయంలోనే మందిరాన్ని పూర్తి చేయాలన్నది ట్రస్ట్ యోచన.
మందిర నిర్మాణంలో జాప్యం జరగొద్దని కేంద్రం కూడా భావిస్తోంది. మందిర నిర్మాణానికి ఎంతకాలం పడుతుందో ముందుగానే చర్చించి టైమ్ ఫ్రేమ్ సెట్ చేసుకోవాలని..ఏది ఏమైనా నిర్ణయించిన సమయంలో ఆలయం పనులు పూర్వవ్వాలని మోదీ కూడా భావిస్తున్నట్లు తెలుస్తోంది. 15 మంది సభ్యులు ఉన్న శ్రీరామ జన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్ట్ సీనియర్ న్యాయవాది పరాశరన్ నేతృత్వం వహిస్తున్నారు. అయితే..మందిర నిర్మాణ సమయంలో రాంలాలా విగ్రహాన్ని ఎక్కడ ఏర్పాటు చేయాలనే అంశంపైనా ట్రస్ట్ చర్చించనుంది.
మరోవైపు అయోధ్య రామాలయ నిర్మాణంపై అభ్యంతరాలు ఆగడం లేదు. ఎవ్వరో ఒకరు ఏదో ఒక అభ్యంతరం చెబుతూనే ఉన్నారు. తాజాగా అయోధ్యకు చెందిన కొందరు ముస్లింలు సంచలన వ్యాఖ్యలు చేశా రు. సమాధులపై ఆలయం ఎలా నిర్మిస్తారని ముస్లింలు ప్రశ్నించారు. సమాధులపై టెంపుల్ నిర్మించడం సనాతన ధర్మానికి విరుద్ధమని..అయోధ్య ట్రస్టుకు నేరుగా లేఖ రాశారు. సమాధులు ఉన్న నాలుగైదు ఎకరాల స్థలాన్ని మాత్రం ఆలయ నిర్మాణానికి వినియోగించవద్దని విజ్ఞప్తి చేశారు.