చైనాని వదలనంటోన్న కరోనా..

Update: 2020-04-13 15:39 GMT

కరోనా వైరస్ వ్యాప్తికి కారణమైన చైనా దేశంలో కేసుల సంఖ్య తగ్గిపోయింది కదా అని ఆంక్షలను తొలగించింది. దీంతో ఆ దేశానికి వీదేశీయుల రాకపోకలు ఎక్కువయ్యాయి. ఆయా దేశాల్లో కోవిడ్ బారిన పడి కోలుకున్న వారు చైనా ఫ్లైట్ ఎక్కడంతో అక్కడికి మళ్లీ వైరస్ వచ్చేసింది. కొత్తగా 100 కోవిడ్ కేసులు నమోదవగా అందులో ఇద్దరు మరణించినట్లు చైనా నేషనల్ హెల్త్ కమిషన్ నివేదించింది. దీంతో దేశంలో కోవిడ్ మృతుల సంఖ్య 3,341కు చేరుకుందని ఆరోగ్య అధికారులు తెలిపారు.

ఆదివారం 108 కోవిడ్ కేసులు నమోదు కాగా అందులో 98 మంది విదేశాలనుంచి వచ్చిన వారే ఉన్నారు. కరోనా పుట్టిల్లు వూహాన్ నగరం వైరస్ నుంచి విముక్తి పొందడంతో ఆంక్షలు తొలగించారు. కానీ విదేశీయుల రాకతో మళ్లీ అక్కడ కూడా వైరస్ పుంజుకుంటోంది. దీంతో చైనా ఆదివారం రష్యా సరిహద్దులో ఉన్న ఈశాన్య నగరమైన సుయిఫెన్‌హేకు వైద్య నిపుణుల బృందాన్ని పంపించింది.

రష్యానుంచి ఇప్పటివరకు మొత్తం 2,497 మంది సూఫెన్‌హేలోకి ప్రవేశించినట్లు అధికారిక సమాచారం. ఆదివారం నాటికి కోవిడ్ మరణాలు హాంకాంగ్‌లో 4, పాజిటివ్ కేసులు 1,004గా నమోదయ్యాయి. మకావోలో 45, తైవాన్‌లో 388 కేసులు, 6 మరణాలు సంభవించాయి. కాగా, 2019 డిసెంబర్‌‌లో ఉద్భవించిన కరోనా వైరస్ కారణంగా ప్రపంచ వ్యాప్తంగా 1,14,185 మరణాలు సంభవించాయి. వైరస్ సోకిన కేసుల సంఖ్య 1.8మిలియన్లుగా నమోదైంది. వీటిలో అత్యధిక మరణాలు అమెరికాలోనే ఉన్నాయి జాన్స్ హాప్కిన్స్ విశ్వవిధ్యాలయ గణాంకాలు చెబుతున్నాయి.

Similar News