కరోనా.. కాస్తైనా కనికరం చూపించట్లేదు.. ఎన్నిరోజులు ఈ వార్తలు వినాలో.. ఎక్కడ చూసినా శవాలు గుట్టలు గుట్టలు. అంత్యక్రియలకు అయిన వారు కూడా రావట్లేదు. ఎంత పాపం చేస్తే మాత్రం ఇంత కఠినంగా శిక్షించాలా దేవుడు. దక్షిణ అమెరికాలోని ఈక్వెడార్ దేశంలో కరోనా కరాళ నృత్యం చేస్తోంది. పనిచేస్తేనే కానీ ఆహారం దొరకని పేదవారు అధికంగా ఉన్న దేశం ఈక్వెడార్. ఇక్కడికి స్పెయిన్, ఇటలీలతో రాకపోకలు ఎక్కువగా ఉంటాయి. దాంతో కరోనా బాధితుల సంఖ్య ఎక్కువగా నమోదవుతుంది.
సామాజిక దూరాన్ని పాటించడంలో అక్కడి ప్రజలు విఫలమవుతుండడంతో పరిస్థితులు దారుణంగా ఉంటున్నాయి. కరోనా మృతదేహాలను ఖననం చేయడానికి ఎక్కువ సమయం పడుతుండడంతో కొన్ని శవాలను రోడ్డు మీద వదిలేస్తున్నారు. మరి కొన్నింటిని సముద్రాల్లోకి తోసేస్తున్నారు. బంధువులు ఎవరైనా కరోనా కాటుకు బలైతే అయిన వాళ్లు వచ్చే పరిస్థితి కూడా లేదు. 1.7 కోట్ల జనాభా ఉన్న ఈ దేశంలో ఇప్పటికే కరోనా బారిన పడిన వారి సంఖ్య 7,466 కాగా, అందులో 333 మంది మృతి చెందారు. అయితే మృతుల సంఖ్య అధికారికంగా చెబుతున్న దాని కన్నా కొన్ని రెట్లు అధికంగా ఉంటుందని ఆరోగ్య శాఖ సిబ్బంది వివరణ.