కరోనా వైరస్‌ని కట్టడి చేయాలంటే ఒక్కటే మార్గం..!!

Update: 2020-04-16 13:01 GMT

ప్రపంచ వ్యాప్తంగా ప్రజలందరినీ వేధిస్తున్న ప్రస్తుత సమస్య కరోనా. ఈ వైరస్ కాటుకు వేల సంఖ్యలో మృత్యువాత పడుతున్నారు. అభివృద్ధి చెందిన దేశాలు సైతం మహమ్మారి విశృంఖలత్వానికి చిగురాటాకులా వణికి పోతున్నాయి. అభివృద్ధి చెందని దేశాల్లో కరోనా కేకలతో పాటు ఆకలి కేకలు కూడా వినిపిస్తున్నాయి. లాక్డౌన్ సందర్భంగా ఆర్థిక వ్యవస్థ చిన్నాభినమవుతోంది. పరిస్థితి ఇలాగే కొనసాగితే రానున్న రోజుల్లో ఎలాంటి విపత్కర పరిణామాలను ఎదుర్కోవలసి వస్తుందోనని ఐక్యరాజ్యసమితి సైతం ఆందోళన చెందుతోంది. ఇదే విషయంపై మాట్లాడిన ఐరాస సెక్రటరీ జనరల్ ఆంటోనియో గుటెర్రస్ ప్రాణాంతక కరోనా వైరస్ కట్టడికి వ్యాక్సిన్ వీలైనంత త్వరగా కనుక్కోవడం ఒక్కటే మార్గమన్నారు. లేకపోతే ఈ వైరస్‌ను మట్టుపెట్టడం అసాధ్యమని ఆయన అభిప్రాయపడ్డారు. ఇప్పటికే ప్రపంచ వ్యాప్తంగా 20 లక్షల మంది కరోనా బారిన పడితే అందులో 1,30,000 మరణాలు సంభవించాయని అన్నారు.

50 ఆఫ్రికన్ దేశాలతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించిన ఆయన కరోనా వ్యాక్సిన్ కనుగొంటే లక్షల మంది ప్రాణాలు కాపాడవచ్చని, కొన్ని కోట్ల డబ్బును ఆదా చేయవచ్చని ఆంటోనియో తెలిపారు. కరోనా వ్యాక్సిన్ వస్తే ప్రపంచం తిరిగి కోలుకుంటుందని ఆయన అభిప్రాయపడ్డారు. 2020 చివరి నాటికి కరోనా వ్యాక్సిన్ కనుగొనేలా తమ పరిశోధనలు కొనసాగాలని శాస్త్రజ్ఞులకు విజ్ఞప్తి చేశారు. కరోనా మహమ్మారిని ఎదుర్కుని ప్రపంచంలోని ప్రజలంతా తమ సాధారణ జీవనాన్ని కొనసాగిస్తారని, దేశాలన్నీ తమ పూర్వవైభవాన్ని సంతరించుకుంటాయని ఆంటోనియో ఆశాభావాన్ని వ్యక్తం చేశారు.

Similar News