కరోనా వైరస్‌పై పోరాటంలో రాష్ట్రాలు తీసుకుంటున్న నిర్ణయాలు, లాక్ డౌన్ పై చర్చించేందుకు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సోమవారం ఉదయం అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులతో సమావేశం నిర్వహించనున్నారు. వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ముఖ్యమంత్రుల అభిప్రాయాలను విననున్నారు మోదీ. ఈ భేటీలో మే 3 తరువాత లాక్‌డౌన్‌ను కొనసాగించడమా? లేక దశలవారీగా ఎత్తివేయడమా? అనే విషయంపైనే ప్రధానంగా చర్చించే అవకాశముందని తెలుస్తోంది. లాక్‌డౌన్ ఒక్కసారిగా ఎత్తివేస్తే పరిస్థితి ఎలా ఉంటుందన్న దానిపై కూడా వారు చర్చిస్తారని తెలుస్తోంది.
ఇక పతనమవుతోన్న ఆర్థిక వ్యవస్థను గాడిన పెట్టేందుకు లాక్‌డౌన్ నుంచి కొన్ని రాష్ట్రాల్లో మినహాయింపులు ఇచ్చిన సంగతి తెలిసిందే. హాట్‌స్పాట్లు లేని నివాస ప్రాంతాల్లో ప్రజలకు అవసరమైన షాపులకు అనుమతులిస్తూ ఇటీవల నిర్ణయం తీసుకున్నారు. దీనిపైనా కూడా చర్చ జరిగే అవకాశం ఉంది. ఇదిలావుంటే కరోనా మహమ్మారిని పూర్తిస్థాయిలో కట్టడి చేయాలంటే లాక్‌డౌన్ ను మరి కొన్నిరోజులు కొనసాగించడమే మేలని పలు రాష్ట్రాలు అభిప్రాయపడుతున్నాయి.