నేనింత కష్టపడుతుంటే నాగురించి అలా..: ట్రంప్

Update: 2020-04-27 12:00 GMT

అమెరికా అధ్యక్ష పదవి చేపట్టిన రోజు నుంచి దేశ ప్రజల కోసం అహర్నిశలు కష్టపడుతున్నాను. నేను చేసినంత పని మరేదేశస్తుడు చేసి ఉండరు. అయినా నా చర్యల్ని తప్పు పడుతూ, నాపై బురదచల్లడానికి ప్రయత్నిస్తోంది మీడియా అని తన బాధనంతా వెళ్లగక్కుతున్నారు డొనాల్డ్ ట్రంప్. ఆయన పనితీరుని విమర్శిస్తూ గురువారం న్యూయార్క్ టైమ్స్‌లో ఓ వార్తా కథనం ప్రచురితమైంది. దాన్ని దృష్టిలో ఉంచుకుని ట్రంప్ పై వ్యాఖ్యలు చేశారు. వివిధ వేశాలతో వాణిజ్య ఒప్పందాలు, సైనిక వ్యవస్థ పునర్నిర్మాణం వంటి అంశాలపై చర్చిస్తూ ఉదయం నుంచి రాత్రి వరకు శ్వేతసౌధంలో పని చేస్తున్నానని ట్రంప్ అన్నారు. వాటన్నింటినీ పక్కన పెట్టి న్యూయార్క్ టైమ్స్ తనపై తప్పుడు వార్తలు ప్రచురించి సొమ్ము చేసుకోవాలని చూస్తోందని ఆయన అంటున్నారు.

నకిలీ వార్తలు ప్రసారం చేస్తున్న మీడియా సంస్థలపై కోర్టులో దావా వేయాల్సిన అవసరం ఉందని ఆయన అన్నారు. ట్రంప్ ఆహారపు అలవాట్లు, ఆయన శ్వేత సౌధానికి వచ్చే సమయం, అధికారులతో వ్యవహరించే తీరును తప్పుపడుతూ న్యూయార్క్ టైమ్స్ ఓ కథనం ప్రచురించడమే అధ్యక్షుడి కోపానికి కారణం. ఇలాంటి మీడియాకి సమయం కేటాయించాల్సిన అవసరం లేదని ఆయన శనివారం అన్నారు. కాగా, అమెరికాలో కోవిడ్ కాస్త తగ్గుముఖం పట్టినట్లుగా కనిపిస్తోంది. శని, ఆది వారాల్లో చూస్తే 1,330 మంది కరోనా వైరస్ బారిన పడి మృతి చెందారు. ఇప్పటి వరకు వైరస్ సోకిన వారి సంఖ్య 9,85,027 కాగా, వీరిలో 1,09,212 మంది కోలుకోగా 55,383 మంది మరణించారు.

Similar News