Nijjar killing: నిజ్జర్ హత్య కేసులో ముగ్గురు భారతీయుల అరెస్టుపై స్పందించిన విదేశాంగ మంత్రి

అరెస్టులకు సంబంధించి అదనపు సమాచారం కోసం వేచి చూస్తున్నామన్న మంత్రి జైశంకర్

Update: 2024-05-05 04:15 GMT

సిక్కు వేర్పాటువాది హర్దీప్ సింగ్ నిజ్జర్ హత్య కేసులో కెనడా పోలీసులు ముగ్గురు భారతీయులను అరెస్టు చేయడంపై విదేశాంగ శాఖ మంత్రి జైశంకర్ స్పందించారు. వారికి సంబంధించి కెనడా పోలీసులు ఇచ్చే సమాచారం కోసం వేచి చూస్తున్నట్టు తెలిపారు. ‘‘ఆ ముగ్గురికి ఏదో గ్యాంగ్‌ బ్యాక్‌గ్రౌండ్ ఉన్నట్టు తెలుస్తోంది. ఈ విషయమై కెనడా పోలీసుల నుంచి సమాచారం కోసం వేచి చూస్తున్నాం. కానీ నేను గతంలో చెప్పినట్టు వాళ్లు కెనడాలో వ్యవస్థీకృత నేరాలను కొనసాగనిచ్చారు. అదే మాకు ఆందోళన కలిగిస్తోంది’’ అని ఆయన అన్నారు. ఈ పరిణామంపై కెనడాలోని భారత హైకమిషనర్ కూడా స్పందించారు. ‘‘కెనడా పోలీసులు ఈ కేసులో ముగ్గురిని అరెస్టు చేశారు. అయితే, ఇది ఆ దేశ అంతర్గత విషయం. దీనిపై వ్యాఖ్యానించేందుకు ఏమీ లేదు’’ అని అన్నారు.

 భారతదేశాన్ని అభివృద్ధి చెందిన దేశంగా మార్చడానికి విదేశాలతో సహా వివిధ రంగాలలో మరిన్ని సంస్కరణలు తీసుకురావడానికి నరేంద్ర మోడీ వంటి బలమైన, చురుకైన ప్రధానమంత్రి అవసరమని ఎస్ జైశంకర్ అన్నారు. కెనడా ప్రజాస్వామ్యాన్ని ఉపయోగించుకుంటున్న ఖలిస్థాన్ అనుకూల వర్గం ప్రజలు లాబీని సృష్టించి ఓటు బ్యాంకుగా మారుతున్నారని విదేశాంగ మంత్రి అన్నారు. కెనడాలో అధికార పార్టీకి పార్లమెంటులో మెజారిటీ లేదని, కొన్ని పార్టీలు ఖలిస్థాన్ అనుకూల నేతలపై ఆధారపడి ఉన్నాయని జైశంకర్ పేర్కొన్నారు

కెనడా పౌరుడు, సిక్కు వేర్పాటువాది హర్దీప్ సింగ్ నిజ్జర్ హత్య కేసులో కెనడా పోలీసులు శుక్రవారం ముగ్గురు భారతీయులను అరెస్టు చేసిన విషయం తెలిసిందే. కొన్ని నెలల పాటు వారిపై నిఘా పెట్టిన అనంతరం శుక్రవారం ఎడ్మంటన్ నగరంలో ఆ ముగ్గురినీ అదుపులోకి తీసుకున్నారు. నిందితులందరూ భారతీయులేనని తేలింది. అయితే, నిందితులకు భారత ప్రభుత్వంతో సంబంధాలు ఉన్నాయా అనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఖలిస్థానీ వేర్పాటువాది నిజ్జర్‌ను గతేడాది సర్రీలో ఓ గురుద్వారా ముందు కొందరు కాల్చి చంపిన విషయం తెలిసిందే. ఈ హత్య వెనుక భారత సీక్రెట్ ఏజెంట్ల హస్తం ఉందని అప్పట్లో కెనడా ప్రధాని జస్టిన్ ట్రూడో ఆరోపించడం సంచలనంగా మారింది.

Tags:    

Similar News