కరోనా వైరస్ దేశంలో విలయతాండవం చేస్తోంది. ఈ మహమ్మారి సామాన్యుడు నుంచి సెలబ్రెటీ వరకు ఎవ్వరినీ వదలడం లేదు. కనిపించని శత్రువుతో డాక్టర్లు, పోలీసులు, పారిశుద్ధ్య కార్మికులతో పాటు జర్నలిస్టులు ముందుండి పోరాడుతున్నారు. అయితే వీరిపై కూడా కరోనా మహమ్మారి ప్రభావం చూపిస్తోంది. ఇప్పటికే వందల సంఖ్యలో కరోనా వైరస్ బారినపడ్డారు జర్నలిస్టులు. కరోనా విజృంభిస్తోన్న నేపథ్యంలో ఒడిశా సీఎం నవీన్ పట్నాయక్ కీలక నిర్ణయం తీసుకున్నారు.
కరోనా కారణంగా మృతిచెందిన జర్నలిస్ట్ కుటుంబానికి రూ. 15 లక్షలు ఎక్స్‌గ్రేషియా ప్రకటించారు సీఎం నవీన్ పట్నాయక్. ప్రాణంతక కరోనా మహమ్మరిపై ప్రజల్లో అవగాహన కల్పించేందుకు జర్నలిస్టులు పోషిస్తున్న బాధ్యత అనిర్వచనీయం అని పేర్కొన్నారు. విధినిర్వహణలో ఏ జర్నలిస్ట్ అయినా వైరస్ భారిన పడి మృతి చెందితే ఆయా కుటుంబాలకు రూ.15 లక్షల ఎక్స్‌గ్రేషియా ఇవ్వనున్నట్లు సీఎం తెలిపారు. ఈ కష్టకాలంలో తమ ప్రాణాలనే పణంగా పెట్టి ప్రజలకు అవగామన కల్పిస్తున్నారని ట్వీట్ చేశారు.
కరోనా మహమ్మరి నుంచి ప్రజల ప్రాణాలు కాపాడుతున్న డాక్టర్లు కరోనా కారణంగా మరణిస్తే వారి కుటుంబానికి చేయూత అందించేందుకు రూ.50 లక్షల ఇవ్వనున్నట్లు గతంలో ప్రభుత్వం ప్రకటించింది. అంతేకాకుండా ఆ వైద్య సిబ్బందిని అమర వీరులుగా పరిగణించి ప్రభుత్వమే అంత్యక్రియలు నిర్వహిస్తుందని పేర్కొంది.