జమ్మూకశ్మీర్‌లోని హంద్వారాలో ఆదివారం జరిగిన ఎన్‌కౌంటర్‌లో అయిదుగురు సైనికులు వీర మరణం పొందారు. వీరిలో ఓ మేజర్, కల్నల్ స్థాయి సైనికాధికారులు కూడా ఉన్నారు. ఓ ఇంట్లో ముష్కరులు బందీలుగా చేసుకున్న కొంత మంది పౌరులను రక్షించేందుకు చేపట్టిన ఆపరేషన్‌లో భాగంగా సైనికులు ఆ ప్రాంతాన్ని జల్లెడ పడుతున్నారు. భద్రతా దళాల కదలికల్ని పసిగట్టిన ముష్కరులు ఒక్కసారిగా కాల్పులకు తెగబడ్డారు. ఈ ఘటనలో ఆర్మీ బృందానికి నాయకత్వం వహిస్తున్న కల్నల్ అశుతోష్ శర్మ, ఓ మేజర్ అమరులయ్యారు. వీరితోపాటు ఓ ఎస్సై, ఇద్దరు సైనికులు కూడా వీరమరణం పొందారు. ఎట్టకేలకు పౌరుల్ని మాత్రం సురక్షితంగా కాపాడి బయటకు తీసుకొచ్చారు.
అమర జవాన్లకు ప్రధాని మోదీ నివాళి అర్పించారు. వారి ధైర్యసాహసాలు, త్యాగాలను ఎన్నటికీ మరవమన్నారు. ఎంతో దీక్షతో వారు దేశానికి సేవ చేశారన్నారు. దేశ పౌరులను రక్షించేందుకు వారు నిరంతరం శ్రమించారన్నారు. ఎన్‌కౌంటర్‌లో ప్రాణాలు కోల్పోయిన జవాన్ల కుటుంబాలు, మిత్రులకు ప్రధాని మోదీ సంతాపం తెలుపుతూ ట్వీట్ చేశారు.