నా భర్త దేశం కోసం ప్రాణాలు కోల్పోయారు.. ఆయన్ని చూసి ఏడవను: కల్నల్ భార్య పల్లవి

Update: 2020-05-04 12:51 GMT

నా భర్త ఓ గొప్ప కారణంతో ప్రాణత్యాగం చేశారు.. ఆయన్ని చూసి ఏడవను అంటున్నారు కల్నల్ అశుతోష్ శర్మ భార్య పల్లవి. ఆర్మీలో చేరాలి దేశం కోసం పోరాడాలి అని ఆయన ఎన్నో కలలు కన్నారు. ఆర్మీలో జాయినవ్వడం కోసం ఆరున్నర సంవత్సరాలు కష్టపడ్డారు.. 13 సార్లు ప్రయత్నించారు. దేశం కోసం పోరాడాలి అన్న ఆలోచన తప్ప మరో ఆలోచన లేని అశుతోష్ భారత సైన్యంలో చేరి ఎన్నో ఆపరేషన్లలో పాల్గొన్నారు. అంచెలంచెలుగా ఎదిగి కల్నల్ స్థాయికి చేరుకున్నారు. ఆదివారం జమ్మూ కశ్మీర్‌లోని హంద్వారాలో జరిగిన ఉగ్రదాడిలో అమరులయ్యారు అశుతోష్ శర్మ. కల్నల్ శర్మకు భార్య పల్లవి, కూతురు తమన్నా ఉన్నారు. ఉగ్రదాడిలో తన భర్త ప్రాణాలు కోల్పోవడం దురదృష్టకరమని అంటూనే, అశుతోష్‌ని చూసి గర్వపడుతున్నానని, ఆయన దేశం కోసం ప్రాణ త్యాగం చేశారని, అందుకే ఏడవనని తెలిపారు.

మే1న ఆయనతో మాట్లాడానని అన్నారు. నాన్న ఆపరేషన్ ముగియగానే వస్తానని చెప్పారని తమన్నా ఏడుస్తూ చెబుతోంది. అశుతోష్ తల్లిదండ్రులు తమ కొడుకుని చూసి గర్వపడుతున్నామని అన్నారు. ఆయన సోదరుడు పియూష్ శర్మ మాట్లాడుతూ.. మా సోదరుడు చాలా ధైర్యవంతుడు, దేశ భక్తి కలవాడు.. నా సోదరుడిని చూసా నా కొడుకు కూడా ఆర్మీలో చేరతానంటున్నాడు. ఆయన మా అందరికీ ఆదర్శం అన తెలిపారు. అశుతోష్ స్వగ్రామం ఉత్తరప్రదేశ్‌లోని బులందర్‌షహర్ కాగా ఆయన అంత్యక్రియలు జైపూర్‌లో నిర్వహిస్తామని సోదరుడు తెలిపారు. కాగా ఆదివారం హంద్వారాలో జరిగిన ఆపరేషన్‌లో ఇద్దరు ఉగ్రవాదులు హతమవ్వగా, ఉగ్రమూకల దాడిలో ఒక కల్నల్, ఒక మేయర్, ఇద్దరు జవాన్లతో పాటు జమ్ముకశ్మీర్ పోలీస్ ఒకరు మరణించారు.

Similar News