ఢిల్లీలో కరోనా వైరస్ పాజిటివ్ కేసుల సంఖ్య అంతకంతకు పెరుగుతోంది. పెరుగుతున్న కేసులను దృష్టిలో ఉంచుకొని బోర్డర్ సెక్యూరిటీ ఫోర్స్ (బీఎస్‌ఎఫ్) ప్రధాన కార్యాలయంలోని రెండు అంతస్తులను బీఎస్‌ఎఫ్ అధికారులు సోమవారం మూసివేశారు. కొంతమంది సిబ్బందికి కరోనా వైరస్ పాజిటివ్‌గా రావటంలో బీఎస్‌ఎఫ్ ఉన్నతాధికారులు ఈ నిర్ణయం తీసుకున్నారు.
ఢిల్లీలోని లోధి రహదారిలోని సీజీఓ కాంప్లెక్స్‌లో మొత్తం ఎనిమిది అంతస్తులు భవనంగా ఈ కార్యాలయం ఉంది. కార్యాలయంలో ఉన్న రెండు గదులకు సీల్ వేశారు. అనంతరం కార్యాలయ భవనానికి శానిటైజేషన్ పనులు చేస్తున్నామని అధికారులు తెలిపారు. మరోవైపు కరోనా పాజిటివ్ వచ్చిన సిబ్బందితో ఎవరెవరు కాంటాక్టు అయ్యారో వారిని గుర్తించే పనిలో ఉన్నట్టు బీఎస్‌ఎఫ్ అధికారులు పేర్కొన్నారు.
ఇదిలావుంటే సెంట్రల్ రిజర్వు పోలీస్ ఫోర్స్(సీఆర్‌పీఎఫ్)లో కూడా కరోనా కలకలం రేగిన సంగతి తెలిసిందే. 130 మందికి పైగా ట్రూపర్లకు కరోనా పాజిటివ్ అని తేలింది. దాంతో ముందు జాగ్రత్త చర్యలో భాగంగా బెటాలియన్ లో మిగిలిన సిబ్బందిని క్వారంటైన్ కు తరలించారు.