కరోనా మహమ్మారి వేల మందిని మృత్యువొడికి చేరుస్తూ కన్నీళ్లను మూటగట్టుకుంటోంది. కన్నవారిని, కని పెంచిన బిడ్డలనీ దూరం చేస్తోంది. ఆఖరికి ఆఖరి చూపులకు కూడా నోచుకోనీయకుండా చేస్తోంది. మూడేళ్ల కొడుకు చావుతో పోరాడి కళ్లు మూసినా కొడుకుని గుండెలకు హత్తుకుని ఏడ్వలేని మానసిక వేదన అనుభవించాడా తండ్రి. కరోనా రోగులకు సేవలందిస్తున్న ఓ వార్డు బాయ్ తన చిన్నారి అంత్యక్రియలు నిర్వహించలేకపోయాడు.
ఉత్తరప్రదేశ్ లక్నోకు చెందిన మనీశ్ కుమార్ (27) లోక్‌బంధు ఆస్పత్రిలో వార్డ్‌బాయ్‌గా పని చేస్తున్నాడు. ఐసోలేషన్ వార్డులో సేవలందిస్తున్న అతడికి శనివారం ఇంటి నుంచి ఫోన్ వచ్చింది. కొడుకు హర్షిత్ శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది పడుతున్నాడని, కడుపునొప్పితో విలవిలాడుతున్నాడని కుటుంబ సభ్యులు తెలిపి ఆస్పత్రికి తీసుకు వెళ్లారు. అయితే అక్కడ హర్షిత్‌కి చికిత్స జరుగుతున్న క్రమంలో ఊపిరి ఆడక ప్రాణాలు కోల్పోయాడు. ఈ విషయాన్ని మనీశ్‌కి ఫోన్లోనే తెలిపారు కుటుంబసభ్యులు.
కొడుకుని కోల్పోవడంతో ఒక్కసారిగా కుప్పకూలిపోయాడు మనీశ్. విషయం అతడు చెప్పకపోయినా సహుద్యోగులు అర్థం చేసుకుని మనీశ్‌ని పంపించారు. అన్ని జాగ్రత్తలు తీసుకుని కొడుకు దగ్గరకు వెళ్లినా నిర్జీవంగా పడి ఉన్న కన్నబిడ్డని చూసి భోరున విలపించాడు. దూరం నుంచే అంబులెన్స్‌ని ఫాలో అయ్యాడు. అంత్యక్రియలు కూడా నిర్వహించలేని పరిస్థితి. ప్రస్తుతం తాను ఇంట్లోనే ఉన్నానని.. పేషెంట్లకు సేవ చేయడమే తన ప్రథమ కర్తవ్యమని త్వరలోనే డ్యూటీలో జాయిన్ అవుతానని మనీశ్ పేర్కొన్నాడు.