దేశంలో కరోనా భయంతో జనాలు వణికిపోతున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో విశాఖ నగర వాసులు ఒక్కసారిగా ఉలిక్కిపడ్డారు. నగరంలోని గోపాలపట్నం పరిధిలోని ఆర్.ఆర్.వెంకటాపురంలో ఉన్న ఎల్‌జీ పాలిమర్స్ రసాయన పరిశ్రమలో భారీ ప్రమాదం చోటు చేసుకుంది. పరిశ్రమ నుంచి రసాయన వాయువు లీక్ అయ్యింది. లీక్ అయిన వాయువు 3 కిలోమీటర్ల మేర వ్యాపించింది. గురువారం తెల్లవారుజామున ఈ ప్రమాదం జరిగింది.
ఈ ఘటనలో 200 మందికి పైగా తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. వీరిలో అధికంగా చిన్నారులే ఉన్నారు. రసాయన వాయువు ప్రభావంతో ఇప్పటి వరకు 8 మంది ప్రాణాలు కోల్పోయారు. మృతుల్లో ఎనిమిదేళ్ల చిన్నారి కూడా ఉంది. ఈ వాయువును పీల్చిన వారు ఎక్కడికక్కడే కుప్పకూలిపోయారు.
బాధితులు కేజీహెచ్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. చికిత్స పొందుతున్న వారిలో పలువురి పరిస్థితి ఆందోళనకరంగా ఉంది. ఎల్‌జీ పాలిమర్స్ పరిశ్రమ నుంచి ఐదు కిలోమీటర్ల పరిధి వరకు ఉన్న నివాసాలను పోలీసులు ఖాళీ చేయిస్తున్నారు. ఈ వాయువు ప్రభావంతో ఆవులు, దూడలు కూడా చనిపోయాయి. కొన్ని ప్రాంతాల్లో అయితే చెట్లు పూర్తిగా మాడిపోయాయి.