ప్రభుత్వ రంగ బ్యాంక్ ఎస్‌బీఐ .. రేపో ఆధారిత వడ్డీ రేటుపై ఇచ్చే గహ రుణాల వడ్డీ రేటును 30 బేసిస్ పాయింట్లు పెంచింది. మే 1 నుంచి ఈ పెంపు అమల్లోకి వచ్చినట్లు తెలిపింది. ఆస్తుల హామీపై ఇచ్చే రుణాలపై వసూలు చేసే వడ్డీ రేటును కూడా 30 బేసిస్ పాయింట్లు పెంచింది. కరోనా నేపథ్యంలో బిల్డర్లు, గృహరుణాలు తీసుకునే వారి నుంచి ఎగవేతలు పెరిగే ప్రమాదాన్ని దృష్టిలో ఉంచుకుని ఎస్బీఐ ఈ చర్య తీసుకుందని భావిస్తున్నారు. సాధారణంగా బ్యాంకు నుంచి లోన్ తీసుకునే వారిలో ఎక్కువ మంది ఎంసీఎల్ఆర్ ఆధారిత వడ్డీ రుణాలను ఎంచుకుంటారు. కాబట్టి రెపో ఆధారిత గృహ రుణాలపై వడ్డీ రేటు పెంపు ప్రభావం ఖాతాదారులపై పెద్దగా ప్రభావం చూపదని భావిస్తున్నారు.
ఎంసీఎల్ఆర్ వడ్డీ రేటు 7.40 శాతం నుంచి 7.25 శాతానికి తగ్గడంతో 30 ఏళ్ల కాలపరిమితిలో తీసుకుని రూ.25 లక్షల ఇంటి రుణంపై నెలవారీ ఈఎంఐ రూ.255కి తగ్గుతుంది. వయోవృద్ధుల కోసం ఎస్బీఐ వియ్‌కేర్ డిపాజిట్ పేరుతో కొత్త పథకం ప్రారంభించింది. ఈ పథకం ద్వారా ప్రస్తుత వడ్డీ రేటుకు రక్షణ కల్పిస్తారు. అలాగే 5 ఏళ్లు, ఆ పైబడిన కాలానికి డిపాజిట్ చేసిన వారికి 0.30 శాతం అదనపు వడ్డీ చెల్లిస్తారు. సెప్టెంబరు 30వ తేదీ వరకు ఈ కొత్త డిపాజిట్ పథకం అందుబాటులో ఉంటుంది. అయితే మరి కొన్ని డిపాజిట్లపై చెల్లించే వడ్డీ రేటును 0.20 శాతం తగ్గించింది. అది ఈ నెల 12 వ తేదీ నుంచి అమల్లోకి వస్తుంది.